'వాల్మీకి'పై కేసు కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్!
on Sep 10, 2019
'వాల్మీకి... ఒక మామూలు మనిషి మహాఋషి అయి రామాయణం రాశాడు. అందుకే, మన సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ అనుకుంటున్నాను' - ఇదీ దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' ట్రయిలర్లో ఇచ్చిన క్లారిఫికేషన్. డైలాగ్ ను డైలాగ్ అని కాకుండా క్లారిఫికేషన్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందటే... వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పై బోయ సామజిక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హీరో గ్యాంగ్ స్టర్‌గా కనిపించే సినిమాకు 'వాల్మీకి' టైటిల్ పెట్టడం తమ మనోభావాలు కించపరచడమే అనీ, టైటిల్ మార్చాలని కోరింది. ఈ విషయమై హైకోర్టుకు కూడా వెళ్లింది. "సినిమా టైటిల్ మార్చాలని, మార్చేవరకూ సినిమా రిలీజ్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి" అని కోరుతూ హైకోర్టులో బోయ సామజిక వర్గం ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. కేసును కొట్టివేసింది. మరోవైపు, సోమవారం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో బోయ సామజిక వర్గం అభ్యంతరాలపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. "ప్రతి వాల్మీకి అభిమాని, బోయ సామజిక వర్గం వారు గర్వపడేలా సినిమా ఉంటుంది" అని చెప్పారు.