పెళ్ళి చూపులు యావరేజ్ సినిమా.. ఓవర్ హైప్ అయింది అంతే!
on Feb 9, 2026

'పెళ్ళి చూపులు' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన తరుణ్ భాస్కర్(Tharun Bhascker).. టాలీవుడ్ లో ప్రతిభగల యువ దర్శకులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల హీరోగా 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమాతో పలకరించిన తరుణ్ భాస్కర్.. త్వరలో మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'గాయపడ్డ సింహం'.
తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'గాయపడ్డ సింహం'(Gaaya Padda Simham). కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
"గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది" అంటూ 'కేజీఎఫ్'లోని డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ డైలాగ్ స్ఫూర్తితోనే ఈ సినిమాకి 'గాయపడ్డ సింహం' అని టైటిల్ పెట్టారని అర్థమవుతోంది. అంతేకాదు, టీజర్ ను కూడా 'కేజీఎఫ్' సినిమాని గుర్తుచేస్తూ సరదాగా కట్ చేశారు. ఫరియా అబ్దుల్లాకు శుభలేఖ సుధాకర్ స్టోరీ చెబుతున్నట్టుగా టీజర్ రూపొందించిన తీరు ఆకట్టుకుంది.
'గాయపడ్డ సింహం'లో అమెరికా వెళ్లాలని కలలు కనే యువకుడి పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపిస్తున్నాడు. టీజర్ సరదాగా సాగింది. అక్కడక్కడా యాక్షన్ సీన్స్ కూడా మెరిశాయి. ఇక టీజర్ చివరిలో తాను డైరెక్ట్ చేసిన 'పెళ్ళి చూపులు' సినిమాపై తరుణ్ సెటైర్ వేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పెళ్ళి చూపులు సీన్ ని రీక్రియేట్ చేస్తూ.. "పెళ్ళి చూపులు మీద మీ ఒపీనియన్ ఏంటి?" అని ఫరియా అడగగా.. "యావరేజ్ సినిమా ఓవర్ హైప్ అయింది అంతే" అంటూ తరుణ్ సమాధానం చెప్పడం విశేషం.
మొత్తానికి 'గాయపడ్డ సింహం' టీజర్ చూస్తే.. త్వరలో థియేటర్లలో సరికొత్త వినోదాన్ని చూడటం ఖాయమనిపిస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ కాంబోలో భారీ మల్టీస్టారర్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



