English | Telugu

'సైరా'ను ఆపడం ఎవరి తరం?.. 'సైరా' ట్రైలర్ రివ్యూ

on Sep 18, 2019

 

మెగా ఫ్యాన్స్.. కాదు కాదు..అందరు హీరోల ఫ్యాన్స్.. దేశంలోని ఫిల్మ్ లవర్స్ అందరూ ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తోన్న 'సైరా.. నరసింహారెడ్డి' ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. 2 నిమిషాల 53 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. గూస్‌బంప్స్ వచ్చాయని చెప్పడం చిన్న మాట. కొద్ది రోజుల క్రితం టీజర్‌లో మనం చూసింది చాలా తక్కువ అనీ, సినిమాలో మనం చూడబోయేది చాలా ఉందనీ ట్రైలర్ చూశాక అర్థమైంది. ఒళ్లు గగుర్పాటు గొలిపే ఆ సన్నివేశాలేమిటి! చూసే కళ్లు మరీ ఇంత చిన్నగా ఉన్నాయేమిటి అని మనం ఫీలయ్యేలా చేసిన ఆ కెమెరా పనితనమేమిటి? ఆ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ తీరేమిటి! ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి హావభావ ప్రదర్శన ఏమిటి! మహా పరాక్రమశాలిగా చేసిన ఆ ఖడ్గచాలనమేమిటి!! చిన్న ట్రైలర్‌లోనే ఎన్ని విశేషాలు!!!  మనం ఊహించిన దానికంటే 'సైరా'లో చాలా చాలా విశేషాలుండబోతున్నాయని ప్రామిస్ చేస్తోంది ట్రైలర్.

"నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతనొక కారణజన్ముడు" అనే మాటలు వినిపిస్తుండగా, కాళ్లూ, చేతులూ గొలుసులతో బంధించిన ఖైదీగా చిరంజీవి చెరశాల నుంచి మెట్లెక్కుతూ బయటకు రావడంతో ట్రైలర్ మొదలయింది. ఆ తర్వాత "అతనొక యోగి", "అతనొక యోధుడు", "అతన్నెవ్వరూ ఆపలేరు" అనే మాటలు నేపథ్యంలో వినిపించాయి. అవి వినిపించే సమయంలో నరసింహారెడ్డి ధ్యానం చేస్తున్న దృశ్యం చూపించారు.

యోధుడిగా బ్రిటిషర్ల శరీరాల్ని ఆయన ఖడ్గం తుత్తునియలు చేసే సన్నివేశాలు, ఆయన వీరత్వాన్ని చాటిచెప్తున్నాయి. దర్శకుడు నరసింహారెడ్డి పాత్రను చరిత్రను మించి ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని మలిచినట్లుగా అర్థమవుతుంది. ఒకవైపు దేశభక్తిని రగిలిస్తూనే, హీరోయిజానికి పరాకాష్ఠ అన్నట్లుగా ఆ పాత్రను సురేందర్ రెడ్డి తీర్చిదిద్దాడని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అందుకే ట్రైలర్ చూస్తుంటే ఒక భావోద్వేగంతో, ఒక ఉత్తేజంతో మనం ఊగిపోతాం.

పొలానికి వచ్చి తమను శిస్తు కట్టమన్న బ్రిటిష్ ఆఫీసర్‌కు "ఈ భూమ్మీద పుట్టింది మేము. ఈ మట్టిలో కలిసేది మేము.. మీకెందుకు కట్టాలిరా శిస్తు?" అని ఆగ్రహంగా ప్రశించాడు నరసింహారెడ్డి. తన మీదకు కత్తి దూసిన అతడ్ని చావగొట్టాడు.

"స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న తొలి యుద్ధమిది. యుద్ధంలో నువ్వు గెలవాలి" అని గురువు గోసాయి వెంకన్న ఆశీర్వదిస్తే, "నీ గెలుపును కళ్లారా చూడాలని వచ్చాను. సైరా.. నరసింహారెడ్డి" అన్నాడు అవుకు రాజు. అంతేనా.. నరసింహారెడ్డితో చేతులు కలిపి బ్రిటిషర్లతో పోరాడాడు. తన వీరత్వాన్ని ప్రదర్శించాడు.

"వీరత్వానికి పేరుబడ్డ తమిళభూమి నుంచి వచ్చా. రాముడికి లక్ష్మణుడిలా నీకూడా ఉంటాను. అది విజయమో.. వీర మరణమో" అని నరసింహారెడ్డితో కలిసి రణభూమికి నడిచాడు రాజాపాండి. అన్నట్లే నదిలో బ్రిటిష్ సైనికుల్ని తన కత్తితో అడ్డంగా నరికేశాడు.

"లక్ష్మి అనే నా పేరు ముందు నరసింహా అనే పేరివ్వండి చాలు" అని లక్ష్మి అంటే, "నన్ను మాత్రం వదలనని మాటివ్వండి" అని సిద్ధమ్మ అడుగుతుంది. ఆమెకు మాటిచ్చాడు నరసింహారెడ్డి. అయితే ఇటు భార్య, అటు ప్రేయసి మధ్య నరసింహారెడ్డి కొంత నలిగి ఉంటాడని మనం ఊహించవచ్చు.

గుర్రబ్బండ్లపై శవాలై వచ్చిన తమ సైనికుల్ని చూసి ఆగ్రహంతో "సిద్ధంకండి. నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని ముక్కల్ని చేస్తాను" అని ఇంగ్లీషులో బ్రిటిష్ దొర హెచ్చరించాడు. "ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి" అని యాక్టర్ పృథ్వీ వాయిస్ వినిపించింది. జనం "మా గుండెల్లో ఉన్నాడు" అని గుండెలు చూపించారు. "షూట్ దెం" అంటూ బ్రిటిష్ దొర ఆర్డర్ వెయ్యడంతో తుపాకులు గర్జించాయి. జనాల ఒళ్లు తుపాకీ గుళ్లతో జల్లెడలా మారాయి. ఆ వెంటనే ఒక పిల్లవాడ్ని బ్రిటిషర్ ఈడ్చుకుంటూ మంటల్లో విసిరేసే సన్నివేశం చూస్తుంటే గుండెలు అవిసిపోయాయి.

"స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా. నా దేశం వదిలి వెళ్లిపోండి. లేదా యుద్ధమే" అని తన వద్దకు రాయబారిగా వచ్చిన వ్యక్తికి చెప్పాడు నరసింహారెడ్డి. అంతకు ముందు కోట గోడపై జెండా పట్టుకొని నిల్చొన్న నరసింహారెడ్డిని చూస్తే ఒళ్లు పులకాంకితమవుతుంది.

ఉరికంబం ముందు నిల్చొని "భారతమాతకీ" అని ఎలుగెత్తి నరసింహారెడ్డి నినదిస్తే, తమ కళ్లముందే ఆ ఉరితీతను ప్రత్యక్షంగా చూస్తున్న జనం "జై" అని గొంతు కలిపారు. ఆ ఉరి సన్నివేశ చిత్రీకరణ ఒళ్లు జలదరించేట్లు ఉంటుందని కెమెరా పనితనం చెబుతోంది.

శిక్ష విధిస్తూ "చివరి కోరికేమైనా ఉంటే టెల్ మి నౌ ఇన్ ఒన్ సెంటెన్స్" అని బ్రిటిష్ జడ్జి అడిగితే, "గెటౌట్ ఫ్రం మై మదర్‌ల్యాండ్" అని గర్జించాడు నరసింహారెడ్డి.. వాట్ ఎ ట్రూ వారియర్! 

మొత్తంగా చూస్తే.. 'సైరా'.. ఒక విజువల్ ఎక్స్‌ట్రావేగంజా అనేది స్పష్టం. టాలీవుడ్ హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టించే సత్తా ఈ సినిమాకు ఉందని ట్రైలర్‌లో చూసిన కొద్ది సన్నివేశాలతోనే మనకు గట్టి నమ్మకం కలుగుతోంది. కేవలం వార్స్ సీన్స్‌ను మాత్రమే గ్రాండియర్ స్కేల్‌లో తియ్యలేదనీ, ప్రతి సన్నివేశాన్నీ, ప్రతి షాట్‌నీ చాలా శ్రద్ధతో.. ఒక శిల్పి శిల్పాన్ని అందంగా చెక్కిన తీరు మాదిరిగా.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెక్కాడనీ తెలుస్తోంది.

పైకి ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమాగా కనిపించవచ్చు. కానీ ట్రైలర్‌తో ఈ సినిమా చాలామందికి గొప్ప పేరు తెస్తుందనీ, పర్ఫార్మెన్స్ పరంగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో కనిపిస్తోన్న ఈ సినిమా టాలీవుడ్ రికార్డుల్నే కాకుండా ఇండియన్ సినిమా రికార్డుల్ని సైతం బద్దలు కొడుతుందనీ, అంతటితో ఆగకుండా నేషనల్ లెవల్లో ఎన్నో అవార్డుల్ని కొల్లగొడుతుందనీ అనిపించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.


Cinema GalleriesLatest News


Video-Gossips