సినిమా మత్తే... మందు తాగలేదు!
on Nov 10, 2018
సినిమా మత్తు అంటే మత్తు కాదు... సినిమా ఊహల్లో వుండటం, సినిమా గురించి ఆలోచించడం అన్నమాట! అక్టోబర్ నెలలో నిర్మాత సురేష్ బాబు రాంగ్ రూటులో కారు డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేయడం వలన ముగ్గురు గాయాల పాలయ్యారు. సురేష్ బాబు మద్యం సేవించి వాహనాన్ని నడిపారని పుకార్లు వినిపించాయి. వాటిని సురేష్ బాబు ఖండించారు. తాను మద్యం సేవించలేదని, హిందీ సినిమా గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయడం వలన యాక్సిడెంట్ అయ్యిందని ప్రముఖ ఆంగ్ల పత్రికతో సురేష్ బాబు పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "సాధారణంగా డ్రైవర్ లేకుండా నేను బయటకు వెళ్ళను. హిందీ సినిమా 'అంధాధున్' బావుందని చెప్పడంతో రీమేక్ రైట్స్ కొనే ఆలోచనతో సినిమా చూడటానికి అత్తాపూర్ వెళ్ళా. ఆ రోజు ఉదయం ఒక వ్యక్తి ఫంక్షన్‌కి రమ్మని ఆహ్వానిస్తే సిటీలో లేనని చెప్పాను. అతడికి నేను సిటీలో వున్నానని తెలిసి మళ్ళీ ఫోన్ చేశాడు. దాంతో అత్తాపూర్ నుంచి కొంపల్లి బయలుదేరా. సినిమా గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ యాక్సిడెంట్ చేశా. ఆ రోజు నేను తాగలేదు. యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి నన్ను చెక్ చేయమని చెప్పాను. వాళ్ళు చెక్ చేయగా.. ఆల్కహాల్ శాతం జీరో అని వచ్చింది. యాక్సిడెంట్ కారణంగా ముగ్గురికి గాయాలు కావడం బాధాకరం. వాళ్ల ట్రీట్మెంట్ ఖర్చులను నేను భరిస్తున్నా. వైద్యులను వాళ్ల ఇంటికి పంపిస్తున్నా" అన్నారు. అదండీ సంగతి.