English | Telugu

తారక్ రెస్పాన్స్ కోసం ఫ్యాన్స్ డిమాండ్!

on Nov 22, 2019

 

జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ తనను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చెయ్యడం వల్లే 'అశోక్' సినిమాని డైరెక్ట్ చెయ్యాల్సి వచ్చిందనీ, లేదంటే అప్పుడు తాను ప్రభాస్‌తో సినిమా చేసుండేవాడినని 'సైరా' డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం సృష్టిస్తున్నాయి. ఒక టీవీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి ఈ విషయం వెల్లడించాడు. కల్యాణ్ రాం హీరోగా నటించిన 'అతనొక్కడే' సినిమాతో సురేందర్ రెడ్డి డైరెక్టర్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాతో కల్యాణ్ రాం తొలిసారి సక్సెస్ రుచి చూశాడు. ఆ మూవీని సురేందర్ రెడ్డి రూపొందించిన విధానం అందరి ప్రశంసలూ పొందింది. దాంతో అతనికి వెంటనే ప్రభాస్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. అతను కూడా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఉద్దేశంతో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న సందర్భంలో, ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి తారక్‌తో 'అశోక్' సినిమా చెయ్యాల్సి వచ్చింది.

'అశోక్' వచ్చిన పదమూడేళ్ల తర్వాత, ప్రభాస్ బదులు తారక్‌తో సినిమా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందనే విషయాన్ని బహిర్గతం చేశాడు సురేందర్. తారక్ మేనేజర్ సుకుమార్ తనను తీసుకుపోయి, అతనితో సినిమా చెయ్యమంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడనీ, మూడు రోజుల పాటు తనను ఫాలో అవుతూ వచ్చాడనీ, దాంతో ప్రభాస్ సినిమాని పక్కనపెట్టి తారక్‌తో 'అశోక్' సినిమా చెయ్యాల్సి వచ్చిందనీ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు సురేందర్. 'అశోక్' కథ తనది కాదనీ, అందువల్లే పూర్తి స్థాయిలో ఆ సినిమాకు న్యాయం చెయ్యలేకపోయాననీ, ఆ సినిమా సరిగా ఆడలేదనీ వెల్లడించాడు. అతను నిజాయితీగా చెప్పిన ఈ మాటలు తారక్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. 'అశోక్' సినిమా ఫెయిలైనప్పటికీ, మరో సినిమా 'ఊసరవెల్లి'ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన తారక్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా సురేందర్ వ్యవహరించాడంటూ సోషల్ మీడియాలో సురేందర్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు.

వాళ్లు సురేందర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం.. వాళ్లను మహేశ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చెయ్యడం. కొంత కాలంగా ఈ ఇద్ధరు హీరోల అభిమానులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ వస్తున్నారు. సక్సెస్‌లో ఉన్న డైరెక్టర్లతోటే మహేశ్ సినిమాలు చేస్తుంటాడని ఇటీవల తారక్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. సురేందర్ కామెంట్స్‌ని హైలైట్ చేస్తూ తారక్ క్యారెక్టర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్‌లో అసహనం కట్టలు తెంచుకుంది. దీనికి సురేందర్ కామెంట్లే మూలం కాబట్టి ఆయనను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి దగ్గరైన సురేందర్.. తనకు మొదట డైరెక్షన్ చాన్స్ ఇచ్చిన నందమూరి ఫ్యామిలీని పబ్లిగ్గా కించపరిచాడని వాళ్లు ఆక్రోశిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు సినిమాల ఛాన్సులివ్వగా, కల్యాణ్ రాం సైతం 'కిక్ 2' సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేస్తున్నారు. సురేందర్‌కి పాఠం చెప్పమంటూ నేరుగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.

సురేందర్ చేసిన కామెంట్స్ చూస్తుంటే తారక్ తన మేనేజర్‌తో అతడిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి, 'అశోక్'ను డైరెక్ట్ చేయించినట్లుగా అనిపిస్తోందనీ, కాబట్టి తారక్ రెస్పాండై, అసలు నిజాలేమిటో బయటపెట్టాలనీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. 'సైరా' తర్వాత సురేందర్ ఏ హీరోను డైరెక్ట్ చేయనున్నాడనే విషయం ఇంతదాకా వెల్లడి కాలేదు. అతను ప్రభాస్‌ను డైరెక్ట్ చెయ్యాలనుకుంటున్నాడనీ, అందుకే అప్పట్లో ప్రభాస్‌తో చెయ్యలేకపోవడానికి ఇప్పుడు వివరణ ఇచ్చి, అతడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నాడనీ తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సురేందర్‌ను ఎంకరేజ్ చేయవద్దని ప్రభాస్‌నూ కోరుతున్నారు.

'అశోక్' ఆఫర్ ఎలా వచ్చిందని ఇంటర్వ్యూయర్ అడిగినదానికి సురేందర్ ఈ రీతిలో స్పందించడం క్యాజువల్‌గా జరిగిందా, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. అనే విషయమై కూడా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. టీడీపీకి పునర్వైభవం రావాలంటే తారక్ ఆ పార్టీ నాయకత్వంలోకి రావాలనీ, క్రియాశీలంగా వ్యవహరించాలనీ ఆయన అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సురేందర్ వ్యాఖ్యలు వాళ్లకి మింగుడుపడటం లేదు. ఆ వ్యాఖ్యల్ని వాళ్లు యమ సీరియస్‌గా తీసుకుంటున్నారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


Cinema GalleriesLatest News


Video-Gossips