బస్ టికెట్స్ టూ బాక్సాఫీస్ టికెట్స్
on Dec 10, 2016
వయసా... 65 ఏళ్లు..అందగాడా? కాదు.. పైగా బట్టతల, విడిగా చూస్తే ఓ లుంగీ, ఓ చొక్కా, మామూలు చెప్పులు.. ఓ మధ్యతరగతి వయసు మళ్లిన పెద్దాయన. కానీ అదే... తెరమీద చూస్తే? ఒక ప్రభంజనం.. ఒక అయస్కాంతం.. ఒక సునామీ. వేలు కదిపినా! డైలాగ్ పలికినా... డ్యాన్సులు, అరుపులే. హీరో అంటే వెండితెర మీద విలన్లపై చెలరేగిపోవటం కాదు. నిజజీవితంలోనూ గెలవాలి. అట్టడుగు స్థాయి నుంచి ...అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి. చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి. ఎంతో మందికి స్ఫూర్తి నివ్వాలి. తనకున్నంతలో కొంత మందికైనా జీవితాన్ని ఇవ్వగలగాలి. అలాంటి వ్యక్తే నిజమైన హీరో. అటువంటి హీరో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.
దైవసమానుడై నీరాజనాలు అందుకుంటాడు. అలా సామన్యుడిగా మొదలై అసమాన్యుడిగా ఎదిగిన సినీ శిఖరం సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన పుట్టినరోజు సందర్భంగా రజనీ సినీ ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. 1949 డిసెంబర్ 12 న బెంగుళూరులో ఒక మరాఠీ కుటుంబం లో జన్మించిన రజనీ కాంత్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివాజీ రావ్ గైక్వాడ్. తండ్రి రామోజీరావ్ గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసేవారు, తల్లి జిజీబాయ్. అయిదేళ్ళ వయసులోనే తల్లిని పోగొట్టుకున్న రజనీకాంత్ చిన్నప్పట్నుంచే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు.
బెంగుళూరులోని రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైస్కూల్ విద్యకు ఫుల్ స్టాప్ పెట్టి బతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేశాడు. తర్వాత బెంగుళూరులో బస్ కండక్టర్ గా రూట్ నెంబర్ 10 Aలో పనిచేశాడు. ఈ క్రమంలో సినీ అవకాశాల కోసం ప్రయత్నించాడు..అలా బాలచందర్ దృష్టిలోపడి అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాలో రజనీ సెకండ్ హీరోగా నటించాడు. ఆ సినిమాలో క్యాన్సర్ రోగిగా ఆయన పోషించిన పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా బ్రేక్ రాలేదు. ఈ దశలో బాలచందర్ రూపంలో మరోసారి అదృష్టం తలుపు తట్టింది. తమిళంలో "అవర్ ఒరు తోడర్ కథై", తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలలో రజనీ పోషించిన పాత్ర సూపర్ హిట్. ఈ చిత్రంలో రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టయిల్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
ఆ తర్వాత విలన్, హీరో అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాడు రజనీ కాంత్ . ఆయన మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం 1978లో విడుదలైన భైరవి. తన రికార్డులను తానే బద్దలు కొట్టడం రజనీ స్టయిల్. బాషా, అన్నామలై, ముత్తు, అరుణాచలం, నరసింహ, ఇలా ప్రతి సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టింది. ముత్తు సినిమాతో ఆయన సినిమాలు జపనీస్ లోకి డబ్బింగ్ అవడం మొదలైంది. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా, చైనా, మలేషియా దేశాల్లోనూ రజనీ సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే భారతీయ స్టార్ సినిమాకూ రావన్నది అక్షర సత్యం. సూపర్ స్టార్ గా , అంతకు మించిన మంచి మనిషిగా కోట్లాది హృదయాలను దోచుకున్న రజనీ కాంత్.. వ్యక్తిగత జీవితంలో నిరాడంబరంగానే ఉంటాడు. మేకప్ తీసేస్తే ఆయన ఓ సాదా సీదా మనిషి. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 ద్వారా రికార్డుల బెండు తీసేందుకు రెడీ అవుతున్నాడు రజనీ. వయసు మీదపడుతున్నప్పటికీ తన అభిమానులను అలరించటమే లక్ష్యం అంటున్న రజనీకాంత్ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిద్దాం.