'వి'తో సుధీర్ ఆశలు ఫలించేనా?
on Jul 13, 2020
కండలు తిరిగిన దేహంతో, స్ఫురద్రూపంతో ఆకట్టుకొనే సుధీర్‌బాబు 'ఏమాయ చేశావే' సినిమాలో హీరోయిన్ సమంత అన్నగా కనిపించినప్పుడు ఎవరీ కొత్త నటుడు అనుకున్నారే కానీ, అతను మహేశ్ చిన్న బావ అనే విషయం చాలామందికి తెలీలేదు. అందులో జెర్రీ క్యారెక్టర్లో ఆకట్టుకున్న అతను ఆ వెంటనే 'శివ మనసులో శ్రుతి' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అప్పుడే అతను మహేశ్ బావ అనే విషయం అందరికీ తెలిసింది. అతని తొలి హీరోయిన్ రెజీనా కసాండ్రా. అందులో అతని యాక్షన్ విన్యాసాలు అలరించినా, సినిమా ఆశించిన రీతిలో హిట్ కాకపోవడంతో ఒకింత నిరాశ చెందాడు.
అయితే మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్' హీరోగా అతడికి తొలి హిట్ రుచిని చూపించింది. ఆ వెంటనే చేసిన 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్‌ను తీసుకొచ్చింది కానీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఆ సినిమా భారీ స్థాయిలో ఏకంగా 800 థియేటర్లలో రిలీజైంది. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు రూపొందించిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ, ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. 'మోసగాళ్లకు మోసగాడు', 'భలే మంచి రోజు' ఓ మోస్తరుగా నడిచాయి. టైగర్ ష్రాఫ్ మూవీ 'బాఘీ'తో బాలీవుడ్లో విలన్‌గా పరిచయమై, హిట్ కొట్టాడు. ఆ సినిమాతో హిందీలో బిజీ అవుతాడేమో అని అందరూ భావిస్తే, అందుకు భిన్నంగా మరో హిందీ సినిమాని ఇంతదాకా చెయ్యలేదు సుధీర్.
'శమంతకమణి' ఫ్లాఫ్ కాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా 'సమ్మోహనం' విజయం సాధించడంతో ఊరట చెందాడు. 2018లో వచ్చిన 'నన్ను దోచుకొందువటే', 'వీరభోగ వసంతరాయలు' సినిమాలు రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఏడాది పైగా గ్యాప్ తీసుకొని ఇంద్రగంటి డైరెక్షన్లో 'వి' మూవీ చేశాడు సుధీర్. ఇందులో నాని విలన్‌గా నటించడం ఓ విశేషం. పోలీస్ ఇన్స్పెక్టర్గా సుధీర్, ప్రొఫెషనల్ కిల్లర్‌గా నాని కనిపించే ఈ సినిమా ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సింది కానీ, కరోనా దెబ్బ కొట్టింది. ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటే అప్పుడు విడుదలవడానికి ఎదురు చూస్తోంది ఈ దిల్ రాజు ప్రొడక్షన్ మూవీ. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్లో ఆశించిన ఎదుగుదల కనిపించని సుధీర్ ఆశలు 'వి'పైనే ఉన్నాయి. దీంతోనైనా అతనేమైనా సాధిస్తాడా?