నిజమైన ఆపద్బాంధవుడు సోను సూద్ ఆదాయం, నికర ఆస్తుల విలువెంతో తెలుసా?
on Jun 12, 2021
మహమ్మారి కోరలు విప్పిన నాటి నుంచీ దేశవ్యాప్తంగా సోను సూద్ పేరు మారుమోగుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి, సొంత ఊళ్లకు వెళ్లాలని తపించేవాళ్ల దగ్గర్నుంచీ అన్నమో రామచంద్రా అంటూ వస్తున్నవాళ్ల వరకూ సోను సూద్ ఓ ఆపద్బాంధవుడయ్యాడు. అనేకమందికి మనిషి రూపంలోని దేవుడయ్యాడు. ఎన్ని వందల, వేలమంది ఆయన వల్ల సాయం పొందారో! ఇప్పటికీ అలుపనేది లేకుండా బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తన హెల్పింగ్ హ్యాండ్స్ పరిధిని రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాడు. ప్రభుత్వాలే చేతులెత్తేసిన సందర్భాల్లోనూ నేనున్నాననే భరోసాను ఇస్తున్నాడు స్వతహాగా పంజాబీ అయిన సోను సూద్.
నాగపూర్‌లో స్థిరపడిన ఓ ఆంధ్రా కుటుంబానికి చెందిన సోనాలి అనే అమ్మాయిని 1996లో లవ్ మ్యారేజ్ చేసుకొనే సమయానికి సోను మరో ముగ్గురు యువకులతో కలిసి ముంబైలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఉండేవాడు. సోనాలి కూడా అదే ఫ్లాట్‌కు వచ్చి, వాళ్లతో కలిసి ఉందంటేనే ఆమెది ఎంత సహృదయమో అర్థం చేసుకోవచ్చు. సోను కంటే ఆమె విద్యాధికురాలు. నాగపూర్‌లోనే పుట్టి పెరిగిన ఆమె ఎంబీఏ చదువుకుంది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు.. ఇషాంత్, అయాన్.
గతేడాది నుంచీ వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు పంపించే కార్యక్రమం దగ్గర్నుంచి సోను ఏ పనిచేసినా, ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తూ వస్తోంది సోనాలి. ఆమెకు వైవాహిక బంధం అంటే కేవలం కలిసి ఒకచోట ఉండటం కాదు. దానికి మించి. కష్ట కాలాల్లో ఒకరికి ఒకరు అన్నట్లుగా గడిపారు ఆ జంట. సోను సెలబ్రిటీ కాకముందే అతడిని పెళ్లాడిన సోనాలి జీవితంలో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంది. మీడియాతో ఎప్పుడూ భార్యతో తనకున్న రొమాంటిక్ కనెక్షన్ గురించి కానీ ఎమోషనల్ కనెక్షన్ గురించి కానీ సోను బయటపెట్టలేదు. పార్టీలకు, ఈవెంట్లకు స్టార్ అయిన తన భర్తతో కలిసి అటెండ్ అయ్యే సోనాలి ఎప్పుడూ ఎక్కడా హంగామా చేసిన దాఖలా లేదు. చాలా ప్రైవసీ మెయిన్టైన్ చేస్తూ వచ్చింది. ఆ ఇద్దరూ పరస్పరం సహకరించుకోవడం వారి రోజువారీ జీవితాన్ని ఆనందమయం చేసింది. వారి వ్యక్తిగతబంధాన్ని సోను స్టార్డమ్ ఏ రకంగానూ ప్రభావితం చేయలేకపోయింది.
అలాంటి సోను సూద్ దగ్గర ఏపాటి ఆస్తులున్నాయనే ఆసక్తి చాలామందికి కలుగుతోంది. సోను సూద్ బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటింది. ఇవాళ టాలీవుడ్, బాలీవుడ్‌లోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సోను ఒకడు. ప్రధానంగా విలన్ పాత్రలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. ఒక రిపోర్ట్ ప్రకారం సోను నికర ఆస్తుల విలువ రూ. 130 కోట్ల పైమాటే అని అంచనా. ఆయన సంవత్సరాదాయం రూ. 12 కోట్ల దాకా ఉంటుంది. సినిమాల్లో నటించడం ద్వారా, ఎండార్స్మెంట్ల ద్వారా, ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆయన ఆదాయం పొందుతున్నాడు.