ఫ్లాప్‌లో ఉండే ఆ హీరోలకు.. 7 హిట్స్ ఇచ్చావే బంగారం!
on Jan 16, 2021
తెలుగు, తమిళ, హిందీ.. ఇలా నాయికగా త్రిభాషా సూత్రాన్ని పాటిస్తుంటుంది శ్రుతి హాసన్. అయితే సక్సెస్ రేట్ పరంగా మాత్రం.. టాలీవుడ్ లోనే అగ్రతాంబూలం దక్కింది. తెలుగులో శ్రుతి ఇప్పటివరకు 11 సినిమాల్లో హీరోయిన్ వేషాలేయగా.. వాటిలో 7 హిట్స్. చిత్రమేమిటంటే.. శ్రుతి హిట్స్ కొట్టిన ఏడు సందర్భాల్లో కూడా ఆయా చిత్రాల హీరోలు అప్పటికే ఫ్లాపుల్లో ఉన్నారు. శ్రుతి ఫ్యాక్టర్ తో భలేగా హిట్ బాట పట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
1. గబ్బర్ సింగ్: తెలుగులో శ్రుతి తొలి విజయం. ఈ చిత్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జల్సా తరువాత సాలిడ్ హిట్ లేదు. ఈ సినిమాతో అటు శ్రుతి కెరీర్ లోనే ఫస్ట్ హిట్ కొట్టగా.. ఇటు పవన్ బౌన్స్ బ్యాక్ బాట పట్టారు.
2. బలుపు: శ్రుతికి తెలుగునాట సెకండ్ హిట్. గబ్బర్ సింగ్ తరువాత వెంటనే వచ్చిన విజయం.. బలుపు. చిత్రమేమిటంటే.. మిరపకాయ్ తరువాత సరైన విజయం లేని మాస్ మహారాజా రవితేజ.. బలుపుతోనే మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు.
3. ఎవడు: ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మెయిన్ లీడ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్. ఇద్దరికీ ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్స్. జంజీర్ (తెలుగులో తుఫాన్)తో చరణ్ షాక్ తింటే.. ఇద్దరమ్మాయిలతో రిజల్ట్ తో బన్నీ షేక్ అయ్యాడు. అలా ఇద్దరికీ శ్రుతి ఫ్యాక్టర్ కలిసొచ్చింది.
4. రేసు గుర్రం: శ్రుతికి తెలుగులో నాలుగో విజయం. బన్నీకి అతిథిగా ఎవడు హిట్ ఇస్తే.. కథానాయకుడిగా రేసుగుర్రం బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇద్దరమ్మాయిలతో షాక్ లో బన్నీకి.. అలా శ్రుతి ఫ్యాక్టర్ వర్కవుట్ అయింది.
5. శ్రీమంతుడు: టాలీవుడ్ లో శ్రుతి ఐదో హిట్. 1 నేనొక్కడినే, ఆగడుతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి శ్రీమంతుడు రూపంలో సెన్సేషనల్ హిట్ దక్కింది. శ్రుతి ఫ్యాక్టర్ ఫ్లాపుల్లో ఉన్న మరో స్టార్ కి భలేగా వర్కవుట్ అయింది.
6. ప్రేమమ్: మనం తరువాత ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచేయ్.. అంటూ హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న యువ సామ్రాట్ నాగచైతన్యకి ప్రేమమ్ సూపర్ రిలీఫ్. ఇందులో శ్రుతి హాసన్ మెయిన్ లీడ్. రిజల్ట్.. హిట్.
7. క్రాక్: శ్రుతికి తెలుగులో ఏడో సక్సెస్ ఫుల్ వెంచర్. తనకిది రి-ఎంట్రీ మూవీ కాగా.. రాజా ది గ్రేట్ తరువాత సరైన హిట్ లేని రవితేజకి రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిన ఫ్లిక్ ఇది. అటు శ్రుతి, ఇటు రవితేజ.. ఇలా ఇద్దరు కూడా క్రాక్ తో ట్రాక్ లో పడ్డారు. సినిమాలో పాడుకున్నట్లే.. భలేగా తగిలావే బంగారం అంటూ మాస్ మహారాజా శ్రుతితో రాగాలు తీసే ఫలితం దక్కింది.
ఈ నేపథ్యంలో.. అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తరువాత వకీల్ సాబ్ తో రి-ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి శ్రుతి ఫ్యాక్టర్ తోడై గ్రాండ్ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.