సల్మాన్ దెబ్బకి అమీర్ అవుట్...!
on Jun 7, 2016
బాలీవుడ్ లో స్టార్ ఎవరు అంటే, ముందు నొటికొచ్చేవి ఖాన్ త్రయం పేర్లే. సల్మాన్, షారుఖ్, అమీర్. ఈ ముగ్గురిదే బాలీవుడ్ రాజ్యం. వీళ్ల తర్వాతే ఎవరైనా. అయితే ఈ ముగ్గురిలో టాప్ ఎవరు అంటే చెప్పడం కష్టమే. ఒక్కోసారి ఒక్కొక్కళ్లు బాక్సాఫీస్ ను ఏలుతూ ఉంటారు. ప్రస్తుతమైతే, సల్మాన్ అండ్ అమీర్ పోటా పోటీగా ఉన్నారు. ఫుల్ కమర్షియల్ దారిలో సల్మాన్ హిట్స్ కొడుతుంటే, పూర్తి ప్రయోగాత్మక చిత్రాలతో అమీర్ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. ఈ ఏడాది మాత్రం కాకతాళీయంగా వీళ్లిద్దరూ ఒకే కాన్సెప్ట్ మీద చేసిన సినిమాలు వస్తున్నాయి. రెజ్లింగ్ కథాంశంగానే అమీర్ ' దంగల్ ', సల్మాన్ ' సుల్తాన్ ' సినిమాలు తెరకెక్కాయి. అయితే మొదటినుంచీ సుల్తాన్ ను ఎవరూ పట్టించుకోలేదు. అమీర్ చేస్తున్న దంగల్ మూవీ ఎంత వైవిధ్యంగా ఉంటుందా అన్న చర్చలే జరిగేవి.
ఎప్పుడైతే సుల్తాన్ ట్రైలర్ రిలీజైందో పరిస్థితి మారిపోయింది. ఆ ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించడంతో ఇప్పుడు అమీర్ కు టెన్షన్ పట్టుకుందట. పైగా తన కాన్సెప్ట్ కూడా ఇంచు మించు సుల్తాన్ లాగే ఉండటంతో, ఆ ఎఫెక్ట్ తన మూవీపై పడుతుందని భయపడుతున్నాడు. ఈ రంజాన్ కే సుల్తాన్ వస్తోంది. ఒకవేళ ఆ సినిమా హిట్టైతే, జనం అదే అంచనాలతో తన మూవీకి వస్తారు కాబట్టి, సినిమా ఫలితం మారిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నాడట అమీర్. అందుకే తన సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేద్దామనుకుంటున్నాడట. ఒక వేళ సుల్తాన్ కాస్త అటూ ఇటూ అయితే మాత్రం ఈ ఏడాది ఆఖర్లో అమీర్ సినిమా రిలీజవుతుంది. మరి ఈ ఖాన్ బ్యాటిల్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.