సైరా... దసరా!
on Jan 8, 2019
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 'సైరా నరసింహారెడ్డి' సినిమాను 2019 వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసినప్పుడు రామ్ చరణ్ అదే మాట చెప్పారు. అయితే... అనుకున్నట్టు షెడ్యూల్స్ జరగకపోవడంతో ఈ వేసవికి 'సైరా' వస్తుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి.
'వినయ విధేయ రామ' విడుదల కానున్న సందర్భంగా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ చరణ్... దసరాకు 'సైరా'ను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. షెడ్యూల్స్ ఆలస్యం కావడంపైనా ఆయన స్పందించారు. "'మా 'సైరా' షెడ్యూల్స్ అన్నీ కరెక్టుగా జరుగుతున్నాయని నేను చెప్పను. 'వినయ విధేయ రామ' షెడ్యూల్స్ కూడా అనుకున్నట్టు జరగలేదు. కొంత డిలే అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే 'సైరా' షూటింగ్ పట్ల సంతోషంగా ఉన్నాను. అనుకున్నట్టు బడ్జెట్ లో సినిమా వెళ్తుంది" అని రామ్ చరణ్ తెలిపారు.
"నాన్నగారి (చిరంజీవి) కోసమే... నాన్నగారి సినిమాల కోసమే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించా. నేను అందులో సినిమాలు చేసే అవకాశం లేదు. నాకు మంచి మంచి నిర్మాతలు వున్నారు. వాళ్ళతో నేను హ్యాపీగా ఉన్నాను" అని ఓ ప్రశ్నకు సమాధానంగా రామ్ చరణ్ చెప్పారు. చిరంజీవికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు? అని ప్రశ్నించగా... "ఈ ప్రశ్న నాన్నగారిని అడగండి. ఆయనే చెబుతారు. ఒక్కటి మాత్రం చెప్పగలను... ఇండస్ట్రీలో ఆయనకు ఎవరూ ఇవ్వనంత ఇస్తున్నా" అని చరణ్ అన్నారు.