'రియల్ మెగాస్టార్'ని రాంచరణ్ చూసిందప్పుడే!
on Sep 9, 2019
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా తండ్రిని అతి సమీపంగా చూస్తూ వస్తున్న చరణ్.. తండ్రిలో అసలైన మెగాస్టార్‌ని ఎప్పుడు చూశాడో తెలుసా? చిన్నతనంలోనో లేక తాను హీరో అయ్యాకనో కాదు.. ఆయన హీరోగా నటించిన సినిమాకు ప్రొడ్యూసర్ అయ్యాక! అవును. ఈ విషయాన్ని చరణ్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
"సైరా మూవీ కోసం నాన్న ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది దానికదే ఒక అనుభవం. ఆయనకు నిర్మాతగా మారాకే 'రియల్ మెగాస్టార్'ను కలిశాను" అని తెలిపాడు చరణ్. ఈ సందర్భంగా 'సైరా' సెట్స్‌పై ఆయన గడ్డాన్ని రెండు వైపులా రెండు చేతివేళ్లతో తాను పట్టుకొని చూస్తున్న ఫొటోను షేర్ చేశాడు. చరణ్ ఆ పని చేస్తున్నప్పుడు చిరంజీవి కొడుకు వంక దీక్షగా చూస్తున్నారు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
అయితే, 'సైరా' సందర్భంగా చరణ్ ఈ కామెంట్ చేసినా, నిజానికి చరణ్ నిర్మాతగా మారింది, చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150' ద్వారా. ఆ సినిమాతోటే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌ను చరణ్ మొదలుపెట్టాడు. ఒక నిర్మాతగా తండ్రిని దగ్గర నుంచి చూస్తూ, కెమెరా ముందు ఆయన విశ్వరూపాన్ని గమనిస్తున్న చరణ్.. ఇప్పుడు తండ్రిలోని 'రియల్ మెగాస్టార్'ను దర్శించాడని అర్థం చేసుకోవాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
