'అన్ఫినిష్డ్' జీవిత చరిత్రను ఫినిష్ చేసిన ప్రియాంక!
on Aug 11, 2020
2018లో 'అన్ఫినిష్డ్' పేరిట తన జీవిత చరిత్రను రాస్తున్నానని ప్రకటించిన గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఎట్టకేలకు ఇప్పుడు దానిని పూర్తి చేసింది. ఈ గుడ్ న్యూస్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నెటిజన్లకు షేర్ చేసిన ఆమె ఆ పుస్తకంలోని ప్రతి పదం తన జీవితంలోకి ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా, మననం ద్వారా వచ్చిందని తెలిపింది.
2019 ఫిబ్రవరిలో 'ద టునైట్ షో'లో దర్శనమిచ్చి టైటిల్ గురించి వివరించింది ప్రియాంక. "దీనికి 'అన్ఫినిష్డ్' అని పేరు పెట్టాను. ఎందుకంటే నా జీవితంలో నేను చేయాలనుకుంటోంది చాలా ఉంది. పైగా దీన్ని నేనింకా రాయలేదు" అని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ పబ్లిష్ చేయనుంది.
పుస్తకం గురించి మాట్లాడుతూ, "నా మాదిరిగానే నిజాయితీగా, ఫన్నీగా, ఉత్తేజంగా, బోల్డ్‌గా, విప్లవాత్మకంగా ఉంటుంది ఈ పుస్తకం. నేనెప్పుడూ ఒక ప్రైవేట్ పర్సన్‌ని. నా జీవిత ప్రయాణంలో నేనెప్పుడూ నా భావాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పింది ప్రింయాక.