English | Telugu

ప్రెషర్ కుక్కర్ మూవీ రివ్యూ

on Feb 21, 2020

నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, సివిఎల్ నరసింహారావు తదితరులు
ఎడిటింగ్: నరేష్ రెడ్డి జొన్న 
సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్, అనిత్ ఎమ్
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
స్వరాలు: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, సమ్రన్ హర్షవర్ధన్ రామేశ్వర్ 
నిర్మాతలు: అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ 
రచన-దర్శకత్వం: సుజోయ్-సుశీల్ 
విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2020

పాటలు, ప్రచార చిత్రాలు 'ప్రెషర్ కుక్కర్' సినిమాకు బజ్ తీసుకొచ్చాయి. 'అమెరికా పొయ్యి నువ్వైతవుర లంగ' అంటూ రాహుల్ సిప్లిగంజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి, సినిమా ఎలా ఉంది?

కథ:

కిషోర్ (సాయి రోనక్) గోల్ ఒక్కటే... అమెరికా పోవడం! ఎందుకంటే... చిన్నతనం నుండి అమెరికా వెళ్లమని తండ్రి నూరిపోస్తాడు కాబట్టి. బీటెక్ పూర్తి చేసిన తర్వాత... ఉద్యోగాలు ఏవీ చేయకుండా యుఎస్ వీసా కోసం కిషోర్ రెండు మూడు ప్రయత్నాలు చేస్తాడు. కానీ, వీసా రాదు. రెండు తప్పులు  చేయడంతో తండ్రి ఇచ్చిన పాతిక లక్షలు పోవడంతో పాటు, ఆ తర్వాత ఏడాది పాటు అమెరికా వీసా రాకుండా బ్యాన్ విధిస్తారు. కిషోర్ చేసిన ఆ రెండు తప్పులు ఏంటి? ఏడాది వీసా ఇవ్వకూడదని అమెరికన్ ఎంబసీ బ్యాన్ విధిస్తే... అమెరికన్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ ఎందుకు ఇచ్చింది? మధ్యలో కిషోర్ ఏం చేశాడు? అనిత (ప్రీతి అస్రాని)తో ప్రేమకథ ఏంటి? తనికెళ్ల భరణి పాత్ర హీరోలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? చివరకు, హీరో అమెరికా వెళ్లాడా? లేదా? అనేది సినిమా.   


విశ్లేషణ:

హీరో అమెరికా వీసా కోసం ప్రయత్నించాడు. రాలేదు. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ రాలేదు. ఇంకోసారి ప్రయత్నించాడు. ఈసారీ  వీసా రాలేదు. మరోసారి ప్రయత్నించాడు. హీరో వీసా కోసం అప్లై చేయడం, రిజెక్ట్ కావడం...  ఫస్టాఫ్ అంతా ఇదే లొల్లి. కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళదు. సెకాండఫ్ కి వస్తే... అమెరికాలో సెటిల్ అయిన పిల్లలు తల్లితండ్రులను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారనేది మెయిన్ గా చూపించారు. ఆల్రెడీ 'శతమానం భవతి', ఇటీవల వచ్చిన 'ప్రతిరోజూ పండగే'లో అదే అంశాన్ని భావోద్వేగంగా చూపించారు. అంతకంటే గొప్పగా 'ప్రెషర్ కుక్కర్'లో ఏమీ చూపించలేదు. గొప్ప డైలాగులు కూడా లేవు. ఫస్టాఫ్ లోని డైలాగుల్లో అమెరికా అనే పదం ఒక వందసార్లు వచ్చి ఉంటుందేమో. అమెరికా సౌండింగ్ విన్న ప్రతిసారీ విరక్తి వచ్చేలా ఆ డైలాగులు రాశారు. అవుట్ డేటెడ్ కామెడీ డైలాగులు గురించి చెప్పుకోకుండా ఉండడం మంచిది. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను, సినిమాను తీయడంలో దర్శక ద్వయం, అన్నదమ్ములు సుజోయ్, సుశీల్ ఫెయిల్ అయ్యారు. ప్రొడక్షన్ వేల్యూస్ కొన్ని సన్నివేశాల్లో ఎంత ఘోరంగా ఉన్నాయంటే... రాహుల్ రామకృష్ణకు విగ్ పెట్టారు. అతడు జుట్టు పెంచుకున్నప్పుడు కొన్ని సీన్స్ తీసినట్టు ఉన్నారు. తర్వాత కొన్ని సీన్స్ తీసేటప్పుడు అతడు హెయిర్ కట్, షేవింగ్ చేయించుకున్నట్టు ఉన్నాడు. విగ్, పెట్టుడు గడ్డంతో షూటింగ్ చేశారు. స్క్రీన్ మీద అది క్లియర్ గా తెలుస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌:
ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి నటన
'గమనించింది ఈ చల్ల గాలి', 'రా రా కొడకా' పాటలు  

మైనస్‌ పాయింట్స్‌:
హీరో సాయి రోనక్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
నిర్మాణ విలువలు
కామెడీ సీన్లు
సన్నివేశాల్లో సాగదీత    

నటీనటుల పనితీరు:
సాయి రోనక్ హైట్, కలర్, స్టయిల్ హీరోకి తగ్గట్టు ఉన్నాయి. కానీ, అతడి ఫేస్ లో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. హీరోయిన్ ప్రీతి అస్రాని క్యూట్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. పెర్ఫార్మన్స్ పరంగానూ బాగా చేసింది. 'గమనించింది' పాటలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్ అండ్ క్యూట్. తనికెళ్ల భరణి అనుభవం పాత్రకు ఉపయోగపడింది. ఆయన నటన వల్ల సెకండాఫ్ లో, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగా వచ్చాయి. రాహుల్ రామకృష్ణకు సరైన సన్నివేశాలు పడలేదు. సినిమాలలో రెగ్యులర్  గా కనిపించే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ టైపులో అతడి పాత్ర ఉంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మరో నటుడు రాజై రోవన్ విసిగించాడు.
 
తెలుగుఒన్‌ పర్ స్పెక్టివ్‌:

సినిమా చూస్తున్నంత సేపూ ఆడియన్స్ పరిస్థితి 'ప్రెషర్ కుక్కర్'లో ఉన్నట్టు ఉంటుంది. థియేటర్ అనే ప్రెషర్ కుక్కర్ లో మంట గట్టిగా పెట్టి కూర్చోబెట్టినట్టు ఉంటుంది. ప్రేక్షకులారా... తస్మాత్ జాగ్రత్త! 

రేటింగ్‌: 1.25/5


Cinema GalleriesLatest News


Video-Gossips