'ప్రభాస్20' టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ వచ్చేస్తున్నాయ్!
on Jul 8, 2020
ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు రెండు రోజుల్లో తెరపడనుంది. అతను హీరోగా నటిస్తోన్న 20వ సినిమా టైటిల్ గురించీ, అందులో ప్రభాస్ లుక్ గురించీ ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్ కళ్లు పత్తికాయలు చేసుకొని ఎదురు చూస్తున్నారు. "మీరంతా ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్! జూలై 10న ఉదయం 10 గంటలకు ప్రభాస్20 సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ వెల్లడవుతాయి" అని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ రోజు తెలిపింది. ప్రభాస్ జోడీగా టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి నటిస్తున్న ఈ మూవీని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఒకప్పటి దేశంలోని సినీ ప్రియుల ఆరాధ్యతార భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ సమర్పిస్తోన్న ఈ సినిమాని గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, ప్రసీద ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.
సచిన్ ఖడేకర్, ప్రియదర్శి, మురళీశర్మ, రిక్షా రాణి, కునాల్‌రాయ్ కపూర్ ఇతర ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలనూ, ఆర్. రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌నూ వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే కన్నడ వెర్షన్ గురించిన ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఇప్పటికైతే 'రాధేశ్యామ్' అనే టైటిల్ ఖాయం చేసినట్లు కొద్ది రోజులుగా ఆన్లైన్లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.