English | Telugu

ప్రభాస్ ఎవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటున్నాడో తెలిస్తే షాకవుతారు!

on Nov 21, 2019

 

ప్రభాస్.. ఇవాళ దేశవ్యాప్తంగా సినీప్రియుల ఆరాధ్య నటుడు. 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కన్‌క్లూజన్' సినిమాల తర్వాత టాలీవుడ్ స్టార్ నుంచి ఇండియన్ స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. 'సాహో' సినిమా ఆ విషయాన్ని మరింత స్పష్టం చేసింది. తెలుగులో కంటే హిందీలోనే ఆ సినిమా మరింత బాగా ఆడటం, అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తేవడం దీనికి నిదర్శనం. దాంతో ఇప్పుడు ప్రభాస్ దేశంలోనే ఏకైక పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఎవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటున్నాడు? వెంటనే ఎవరికైనా అనుష్క పేరు మనసులో మెదులుతుంది. అనుష్కతో కాకుండా ఇంకెవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటాడని అతని ఫ్యాన్స్ కూడా అనుకుంటారు. కారణం.. ఎన్నో ఏళ్ల నుంచీ ఆ ఇద్దరి రిలేషన్‌షిప్‌పై ప్రచారం నడుస్తుండటం.

అనుష్కతో తనకు అలాంటి రిలేషన్‌షిప్ ఏమీ లేదని గతంలో అనేకసార్లు ప్రభాస్ తేల్చిచెప్పాడు కానీ జనమే నమ్మట్లేదు. మరోవైపు అతని పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నాలుగేళ్ల నుంచీ ఎప్పటికప్పుడు ఈ ఏడాది ప్రభాస్ పెళ్లవుతుందంటూ చెబుతూ వస్తున్నారు కానీ అది నిజమవడం లేదు. దాంతో ప్రభాస్, అనుష్క ప్రేమాయణం వ్యవహారం అటకెక్కకుండా పచ్చిగానే ఉంటూ వస్తోంది. అనుష్క విషయం అలా ఉంచితే, నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ఇండియా'గా పరిగణిస్తోన్న ప్రభాస్‌తో డేటింగ్ చెయ్యడానికి ఎంతోమంది అమ్మాయిలు లైన్‌లో ఉంటారనేది నిజం. మరి ప్రభాస్‌కు చాన్స్ వస్తే, ఎవరితో డేటింగ్ చెయ్యాలనుకుంటాడు? ఇటీవల తన మనసులో మాటను బయటపెట్టాడు ప్రభాస్. అయితే అతను డేటింగ్ చెయ్యాలనుకుంటోంది ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న నటి కావడం గమనార్హం. ముంబైలో ప్రభాస్‌ను "మీకు అవకాశమొస్తే ఏ నటితో డేటింగ్‌కు వెళ్లాలనుకుంటారు?" అని ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగితే, "నేను రవీనా టాండన్ అభిమానిని. ఆమెతో డేటింగ్ ఛాన్స్ వస్తే వదులుకోను" అని నవ్వేశాడు. అయితే అతడు ఆ మాటల్ని సరదాగానే చెప్పినా, రవీనా అంటే అతడికున్న అభిమానాన్ని ఆ మాటలు పట్టిస్తున్నాయి.

 

 

45 ఏళ్ల రవీనా కొంత కాలం క్రితం బాలీవుడ్‌లోని అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనూ నాలుగు సినిమాలు.. 'రథసారథి', 'బంగారు బుల్లోడు', 'ఆకాశ వీధిలో', 'పాండవులు పాండవులు తుమ్మెదా' సినిమాల్లో నాయికగా నటించారు. వీటిలో 'బంగారు బుల్లోడు' సినిమాలో బాలకృష్ణతో కలిసి ఆమె డాన్స్ చేసిన 'స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవానా' అనే పాట ఐకనిక్ రెయిన్ సాంగ్‌గా నిలిచిపోవడం మనకు తెలుసు. ఆ పాటలో రవీనా పరువాలు, వంపుసొంపుల సొగసును ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. 2004లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని ఆమె పెళ్లాడారు. పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న రవీనా, వివాహానంతరం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2001లో 'దమన్' సినిమాలో భర్త వల్ల హింసకు గురైన భార్యగా అద్భుతంగా నటించి, జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. వివాహానంతరం పిల్లలు పుట్టాక నటనకు కాస్త విరామమిచ్చిన ఆమె మళ్లీ నటిస్తూ వస్తున్నారు. పెళ్లయిన పదేళ్లకు మోహన్‌బాబు జోడీగా 'పాండవులు పాండవులు తుమ్మెదా'లో నటించడం గమనార్హం.

 

అలాంటి సౌందర్యరాశి అయిన రవీనాతో డేటింగ్‌కు వెళ్లాలనుకుంటానని ప్రభాస్ చెప్పడంలో వింతేముంది. అంతే కాదు.. 'సాహో' సినిమా విడుదలకు ముందు, ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హిందీ టెలివిజన్ రియాలిటీ షో 'నాచ్ బలియే' సీజన్ 9లో రవీనాతో కలిసి 'టిప్ టిప్ బర్సా పాని' పాటకు స్టెప్పులేశాడు ప్రభాస్. అది కూడా ఒక ఫేమస్ రెయిన్ సాంగ్ కావడం గమనార్హం. 'మొహ్రా' సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా జంటపై ఆ పాట తీశారు. ఆ పాటలోనూ రవీనా చేసిన నృత్యం, ఆమె అందాలు ప్రేక్షకుల మతులు పోగొట్టాయనేది నిజం. ఆ పాటకు 'నాచ్ బలియే'లో రవీనాతో ప్రభాస్ స్టెప్పులేసి, కావలించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో 'జాన్' సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.


Cinema GalleriesLatest News


Video-Gossips