కరోనా విముక్త భారత్ సాధించినప్పుడే నిజమైన ఉగాది!
on Mar 24, 2020
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 21 రోజుల లాక్‌డౌన్ పిలుపును ప్రజలందరూ అందిపుచ్చుకొని, తమ ఇళ్లకే పరిమితం కావాలని పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థించారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్లుగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే 21 రోజుల లాక్‌డౌన్‌ను విధిగా పాటించాల్సిందిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన సలహాలు, సూచనలను అందరూ విధిగా పాటించి తీరాలి. దీనికి వేరే దారి లేదు. దయచేసి అందరూ ఇళ్లల్లోనే ఉండండి. ఎవరూ బయటకు రావద్దు. ప్రాణాల మీదకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ఎమర్జెన్సీ సర్వీసులకు ఫోన్ చేయండి. ఏం చెయ్యాలో వాళ్లు తెలియజేస్తారు. ప్రధాని మాట పాటిద్దాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం" అని పిలుపునిచ్చారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. "తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సోదర సోదరీమణులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యావత్తు మానవాళి అంతా కరోనాతో గజగజలాడిపోతోంది. ఈ మహమ్మారి మానవ జాతిని కబళించడానికి పొంచి ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వస్తున్న శార్వరి నామ ఉగాది సర్వజనులకూ మేలు చేయాలని, సంపూర్ణ ఆయుష్షును ఇవ్వాలని నా తరపున, జనసైనికుల తరపున కోరుకుంటున్నాను. ఉగాది వేడుకలను ఇంటికి పరిమితం చేసుకుందాం. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పండుగ జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచానికి కరోనా ముప్పు తొలగిననాడే మనకు నిజమైన ఉగాది. ఆ ముప్పును పారద్రోలడానికి ప్రభుత్వ సూచనలను పాటిద్దాం. కలసికట్టుగా పోరాడదాం" అని ఆయన చెప్పారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
