English | Telugu

బన్నీని చూస్తూ 'ఓ మై గాడ్ డాడీ' అని తలకొట్టుకున్న అయాన్!

on Nov 14, 2019

 

ఇప్పటికే రెండు పాటలతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకున్న 'అల.. వైకుంఠపురములో' మూవీకి సంబంధించిన మూడో పాట శాంపిల్.. అంటే టీజర్‌ను.. ఆదిత్యా మ్యూజిక్ సంస్థ గురువారం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. నవంబర్ 14 చిల్డ్రెన్స్ డే కావడంతో దానికి రిలేటెడ్‌గా ఉన్న 'ఓ మై గాడ్ డాడీ' అనే సాంగ్‌ను కొద్దిగా రుచి చూపించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాలోని పాటలకు తమన్ సమకూర్చిన ట్యూన్స్ ఏ రేంజిలో ఉన్నాయో తొలి రెండు పాటలు చాలా గ్రాండ్‌గా తెలియజేశాయి. మొదట రిలీజ్ చేసిన సీతారామశాస్త్రి పాట 'సామజవరగమన' ఇప్పటిదాకా 81 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించగా, కాసర్ల శ్యామ్ రాసిన రెండో పాట 'రాములో రాములా' సైతం తొలి పాటను అనుసరిస్తూ ఇంతవరకూ 48 మిలియన్ వ్యూస్ సాధించింది. తొలి పాటను సిద్ శ్రీరామ్, రెండో పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. 

ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య రాసిన ఈ పాటను ఒకరిద్దరు కాకుండా ఐదుగురు సింగర్స్ ఆలపించడం గమనార్హం. 'బిగ్ బాస్ 3' విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు రోల్ రిడా, బ్లేజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్ కలిసి ఈ సాంగ్ పాడారు. "ఓ మైగాడ్ డాడీ.. జస్ట్ డోంట్ బి మై బాడీ.. డోంట్ బి సో హార్డీ.. దట్ విల్ మేక్ మి శాడీ.." అంటూ ఇంగ్లీషులో ర్యాప్ స్టైల్లో సాగే ఈ పాట పాశ్చాత్య సంగీతాన్ని ఇష్టపడే వాళ్లను అలరించే విధంగా ఉంది. ఈ సాంగ్ టీజర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే.. అందులో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కనిపించడం. "ఓ మైగాడ్ డాడీ.." అంటూ పాట వినిపిస్తుంటే, దానికి తగ్గట్లుగా తండ్రి బిగ్ సైజ్ ఫొటోను చూస్తూ అయాన్ యాక్షన్ చేస్తూ కనిపించడం, తల కొట్టుకోవడం ముచ్చట గొలుపుతోంది. అన్నను చూసి అర్హ కూడా అలాగే చేత్తో నుదిటిని కొట్టుకోవడం.. సో క్యూట్. టీజర్ మొదట్లోనే 'అయాన్ ఎబౌట్ అల్లు అర్జున్' అంటూ వేశారు.

'లలలలాల్లా లలలల్లలాల్లా' అంటూ పాట మొదలవగా ఇంటి లాన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చాడు అయాన్. ఈ సినిమాకి సంబంధించిన, నవ్వుతూ ఉన్న తండ్రి బిగ్ సైజ్ వినైల్ ఫొటోను చూసి, "ఓ మైగాడ్ డాడీ" అంటూ నుదుటిని కొట్టుకున్నాడు. అన్న అలా చేస్తుంటే, వైట్ గౌనులో ఉన్న అర్హ.. తండ్రి ఫొటోను ఆనుకొని అందంగా సిగ్గుపడుతూ నిల్చొంది. తన పక్కకు అయాన్ చేరగానే, అర్హ కళ్లు మూసుకుంది. అయాన్ నుదుటిపై చేయి పెట్టుకున్నాడు. తండి ఫొటోపై చేతులుపెట్టి డాన్స్ కూడా చేశాడు. ఆ తర్వాత అన్నా చెల్లెళ్లిద్దరూ ఇంట్లోకి పరుగులు తీశారు. మొత్తానికి ఒక క్యూట్ కాన్సెప్టుతో ఈ సాంగ్ టీజర్‌ను రూపొందించారు. నవంబర్ 14 బాలల దినోత్సవం కాబట్టి, పిల్లలతో ఈ టీజర్‌ను రూపొందించడం సందర్భోచితంగా ఉంది. సినిమాలో ఏ సందర్భంలో ఈ సాంగ్ వస్తుందో చూడాలి.

'ఓ మై గాడ్ డాడీ' ఫుల్ సాంగ్‌ను నవంబర్ 22న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రకటించాయి. కాగా ఈ చిల్డ్రెన్స్ డేకి తన పిల్లల్ని మిస్సవుతున్నానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు బన్నీ. "ఓ మై గాడ్ డాడీ సాంగ్ కిక్ స్టార్ట్స్. చిల్డ్రెన్స్ డేకి నా పిల్లల నుంచి అందుకున్న స్వీటెస్ట్ గిఫ్ట్. థాంక్యూ అయాన్, అర్హా.. నాన్న మిసెస్ యు అండ్ లవ్స్ యూ సో మచ్.. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రెన్స్ డే" అని ఆయన ట్వీట్ చేశాడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిసోన్న ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత పేరుపొందిన బాలీవుడ్ యాక్ట్రెస్ టబు టాలీవుడ్‌లోకి మళ్లీ వస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ ఒక జంటగా కనిపిస్తారు. జయరాం, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, సముద్రకని, తనికెళ్ల భరణి, సునీల్, నవదీప్, ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, అజయ్, రాహుల్ రామకృష్ణ, రోహిణి వంటి పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అనే విషయం ఇప్పటికే తేలిపోయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతున్న 'అల వైకుంఠపురములో' మూవీ ఏ రేంజి బ్లాక్‌బస్టర్ అవుతుందనేది అల్లు అర్జున్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్ మీద ఆధారపడి ఉంది.


Cinema GalleriesLatest News


Video-Gossips