చీరలో అమ్మను అందంగా కెమెరాతో బంధించిన కాజోల్ కూతురు!
on Sep 21, 2020
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన చిన్న చిన్న అంశాల్ని పంచుకోవడానికి ఇష్టపడే కాజోల్.. ఇంట్లో పదేళ్ల కొడుకు యుగ్ దేవ్‌గణ్ తీసే పిక్చర్స్‌ను తరచూ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె తన కూతురు నైసాతో కలిసి సింగ్‌పూర్‌లో ఉంటుండటం వల్ల ఆమె యుగ్ను మిస్సవుతోంది. అయితేనేం.. ఇంటి ఫొటోగ్రాఫర్ బాధ్యతను పదిహేడేళ్ల నైసా తీసుకుంది. కాజోల్కు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సింగపూర్‌లోని తమ ఫ్లాట్‌లో చీరలో తల్లి అపురూప సౌందర్యాన్ని నైసా తన కెమెరాతో అద్భుతంగా పట్టేసింది.
ఆ పిక్చర్స్‌ను కాజోల్ తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. "చీరలు ధరించడం నిజంగా మిస్సయ్యాను. కాబట్టి ఇప్పుడు ఆ పని చేసే రోజు వచ్చింది. Love the saree for all the subtle possibilities... hmmm! మరొక ఇంటి ఫొటోగ్రాఫర్.. ఈసారి నా డాటర్." అని ఆ పిక్చర్స్‌కు కాప్షన్ పెట్టింది కాజోల్. నిజంగా ఆ శారీలో కాజోల్ ముగ్ధమోహనత్వాన్ని చూసి తీరాల్సిందే.
కొన్ని రోజుల క్రితం నైసాతో కలిసి సింగపూర్‌కు వెళ్లింది కాజోల్. కొడుకు యుగ్ తండ్రి అజయ్ దేవ్‌గణ్‌తో పాటు తమ ఇంట్లో ముంబైలో ఉంటున్నాడు. సింగపూర్‌లో లాక్డౌన్ ఎత్తివేయడంతో నైసా చదువుకుంటున్న కాలేజీ తెరిచారు. కరోనా కాలంలో కూతుర్ని ఒక్కదాన్నే సింగపూర్‌కు పంపడం ఇష్టంలేక, ఆమెకు తోడుగా ఉండేందుకు భర్తను, కొడుకును వదిలి నైసాతో పాటు సింగపూర్‌లోని తమ ఫ్లాట్‌కు తాత్కాలికంగా షిఫ్ట్ అయ్యింది కాజోల్. ప్రస్తుతం ముంబైలో ఉన్న భర్త, కొడుకును వీడియో కాల్స్ ద్వారా చూసుకుంటూ వస్తోంది.