English | Telugu

'గద్దలకొండ గణేష్' ఓపెనింగ్ కలెక్షన్ అదుర్స్!

on Sep 21, 2019

 

'వాల్మీకి' నుంచి 'గద్దలకొండ గణేష్'గా మారిన మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 20న రిలీజైన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గద్దలకొండ గణేష్' 5.50 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసి, ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్. వెంకటేశ్‌తో కలిసి అతను నటించిన మల్టీ స్టారర్ 'ఎఫ్ 2' సినిమాయే ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4.96 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. దానికి మించి 'గద్దలకొండ గణేష్' ఎక్కువ కలెక్షన్ రాబట్టడం విశేషమే.

తొలిసారి వరుణ్ తేజ్ విలన్‌గా నటించాడనే అంశం సోషల్ మీడియాలోనే కాకుండా మాస్ ఏరియాల్లోనూ భారీ ప్రచారానికి నోచుకోవడం ఈ స్థాయి ఓపెనింగ్స్‌కు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 'దేవత'లోని సూపర్ హిట్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా' సాంగ్‌ను వరుణ్ తేజ్, పూజా హెగ్డేపై తీయడం, ఆ పాట కూడా వైరల్ అవడం, 'వాల్మీకి' టైటిల్ కాంట్రవర్సీ కలిసి 'గద్దలకొండ గణేష్'కు ఊహించిన దానికి మించి హైప్ తీసుకు వచ్చాయి. ఫలితమే ఈ ఓపెనింగ్స్ అంటున్నారు.

గమనించాల్సిన విషయం.. 'ఏ' సెంటర్స్ కంటే 'బి, సి' సెంటర్స్‌లో ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తుండటం. వరుణ్ కేరెక్టర్, అతని లుక్ మాస్ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో 'గద్దలకొండ గణేష్' సర్‌ప్రైజింగ్ రిజల్ట్ సాధించే అవకాశాలున్నాయి. మౌత్ టాక్ మీదే ఇది ఆధారపడి ఉంది.

విలంగ్‌గా నటించడం ఒకెత్తు.. మిడిల్ ఏజ్డ్ విలన్‌గా నటించడం ఇంకో ఎత్తు. కుర్రాడైన వరుణ్ గడ్డం కాస్త నెరిసిన మిడిల్ ఏజ్డ్ రౌడీగా నటించడం సాహసమే అని చెప్పాలి. తనకు ఎదురు తిరిగినవాళ్లను, తన వెనుక గోతులు తీసిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా, అతి కిరాతకంగా చంపేసే గద్దలకొండ గణేష్ క్యారెక్టర్‌లో విశేషంగా రాణించాడు వరుణ్. ఇప్పటివరకూ అతడు చేసిన కేరెక్టర్స్‌తో పోలిస్తే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ కేరెక్టర్ మాత్రమే కాదు, రిస్కీ కేరెక్టర్ కూడా. అతను వికృతంగా, భయంకరంగా నవ్వినప్పుడు ప్రేక్షకుల ఓళ్లు జలదరిస్తేనే.. అతడు సక్సెస్ అయినట్లు. వరుణ్ సక్సెసయ్యాడు. అందుకే అంచనాలకు తగ్గట్లు ఓపెనింగ్స్ రాబట్టాడు.

ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో సినీ తార శ్రీదేవి ఫ్యాన్‌గా, నిజ జీవితంలో అదే పేరుతో పరిచయమైన యువతి ప్రేమికుడుగా, 1980ల నాటి రూపంతో ఆకట్టుకున్నాడు వరుణ్. ఆ రోజుల్లో చిరంజీవి కనిపించినట్లు నుదుటి మీద పడే ఉంగరాల జుట్టు, బెల్‌బాటం ప్యాంటుతో భలేగా ఉన్నాడనిపించుకున్నాడు. ఇలా తన కేరెక్టర్‌కు సంపూర్ణ న్యాయం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. రాబోయే రోజుల్లో 'గద్దలకొండ గణేష్' సాధించే వసూళ్లు వరుణ్ ఖాతలోకే వస్తాయని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here