ఒక్క ఛాన్స్ ఇవ్వండి... నవ్విస్తాం: ప్రియదర్శి
on Feb 15, 2019
"మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి... మిమ్మల్ని (ప్రేక్షకుల్ని) నవ్విస్తాం" అంటున్నారు ప్రియదర్శి. సంక్రాంతి విజేత 'ఎఫ్2'తో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో వినోదం పండించిన ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా 'మిఠాయి'. ఇందులో రాహుల్ రామకృష్ణ మరో హీరో. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. శుక్రవారం రాత్రి ఆడియో విడుదలైంది. ఆడియో వేడుకలో ప్రియదర్శి మాట్లాడుతూ "ఇదో డార్క్ కామెడీ సినిమా. దర్శకుడు ప్రశాంత్ కుమార్ స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నాడు. చదివాకా.. నాలో చాలా భయాలు ఉన్నాయి. డార్క్ కామెడీ సినిమా కదా. ఎలా ఉంటుందోనని. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక... అంతా సెట్ అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ కి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ చేశాం. థియేటర్లలో మీరు (ప్రేక్షకులు) కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లలో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం" అన్నారు.