సమంత కోసమా? నందిని కోసమా?
on Oct 18, 2018
సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇది సౌత్ కొరియన్ కామెడీ డ్రామా 'మిస్ గ్రానీ'కి రీమేక్. ఇందులో నటించడానికి హీరో నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ టాక్. సినిమా కథ విషయానికి వస్తే... ఓ 70 ఏళ్ళ వృద్ధురాలు, 20 ఏళ్ళ అమ్మాయిగా మారుతుంది. అప్పుడు పడుచు శరీరంలో వున్న ముసలి బామ్మ ఏం చేసిందనేది కథ! 70 ఏళ్ళ బామ్మలా, 20 ఏళ్ళ అమ్మాయిలా... రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్ కనుక సమంత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథలో హీరో పాత్రకు వెయిట్ ఎక్కువ వుండదు. కథంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. అందుకని, నాగశౌర్యకు ఏం నచ్చి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది ఎవరి అర్థం కావడం లేదు. సమంత కోసం సినిమా చేస్తున్నాడా? దర్శకురాలు నందినిరెడ్డి కోసమా? అనేది పజిల్.
సమంతతో నాగశౌర్య ఇప్పటివరకూ నటించలేదు. ఆమెతో నటించే అవకాశం కోసం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అనుకోవడానికి లేదు. 'కణం' తరవాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే ఎలా వుంటుందో? శౌర్యకు అర్థమైంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. దర్శకురాలు నందినిరెడ్డి కోసమూ కాదు. ఆమె ఇచ్చిన మాట కోసం సినిమా చేస్తున్నాడట! నందినిరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య 'కల్యాణ వైభోగమే' చేశాడు. ఆమె దర్శకత్వ శైలి గురించి అవగాహన వుంది. సౌత్ కొరియన్ కామెడీ డ్రామా 'మిస్ గ్రానీ'ని మక్కికి మక్కిగా రీమేక్ చేయకుండా... తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తానని, హీరో క్యారెక్టర్ వెయిట్ పెంచుతానని నాగశౌర్యకు నందినిరెడ్డి ప్రామిస్ చేస్తారట. అందుకని సినిమా చేస్తున్నాడని టాక్.