ఏడేళ్ల క్రితం.. 'బాహుబలి' మొదలైన క్షణం!
on Jul 6, 2020
ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రొమ్ము విరుచుకునే స్థాయికి ఎదగడానికి బీజం పడింది. యస్.యస్. రాజమౌళి స్వప్నించిన రెండు భాగాల మాగ్నమ్ ఓపస్ 'బాహుబలి' సినిమా తొలి భాగం 'బాహుబలి: ద బిగినింగ్' షూటింగ్ మొదలైంది ఈ తేదీనే. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన 'బాహుబలి'తో దేశమంతా తెలుగు సినిమా వైపు తిరిగి చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవం.
'బాహుబలి' మూవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఆ సినిమా మొదటి రోజు షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. బాహుబలిగా అద్వితీయంగా నటించి, ఇవాళ దేశంలోని ఏకైక పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన ప్రభాస్.. ఆ సినిమా సెట్స్ వద్దకు వచ్చిన అశేష అభిమానుల అభినందనలు అందుకుంటున్న ఫొటో కూడా వాటిలో ఉంది. అలాగే ఎత్తైన స్టాండ్ మీద మైక్ పట్టుకు నిల్చొని తన సిబ్బందికి సూచనలిస్తున్న రాజమౌళి ఫొటోను కూడా అందులో షేర్ చేశారు.
"July 6, 2013. The moment when it all began! We started the shoot of Baahubali on this day 7 years ago." అని బాహుబలి మూవీ టీమ్ ట్వీట్ చేసింది.