English | Telugu

బిగ్ స్టోరీ: టాలీవుడ్‌లో కొత్త జంటల సందడి

on Feb 24, 2020

 

తొలినాళ్ల నుంచీ తెలుగు సినిమా తెరపై ఎన్నో జంటలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ వస్తున్నాయి. స్క్రీన్‌పై వాళ్ల కెమిస్ట్రీ, వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనం అబ్బురపడుతూ వస్తున్నారు. హీరో హీరోయిన్లు విడిపోయిన సీన్లు వస్తే మనం చాలా బాధపడతాం. చివరలోనైనా ఆ ఇద్దరూ కలుసుకోవాలని కోరుకుంటాం. ఎప్పుడైనా ఆ ఇద్దరిలో ఒకరు చనిపోవడమో, లేక ఇద్దరూ చనిపోవడమో జరిగితే మన గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. 'దేవదాసు', 'మరో చరిత్ర', 'ప్రేమాభిషేకం' వంటి సినిమాలు విషాదాంతం అయినప్పుడు మన హృదయాలు బద్దలయ్యాయి, అయినా కానీ వాటికి మనం బ్రహ్మరథం పట్టాం. అయితే అల్టిమేట్‌గా మనం సుఖాంతాన్నే కోరుకుంటాం. అందుకే విషాదాంతం అయిన చాలా సినిమాల్ని మనం తిరస్కరించేశాం.

కొంత కాలం క్రితం ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది దశకాల్లో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎక్కువగా పాటలకూ, ముద్దు ముచ్చట్లకే పరిమితమై కనిపించేది. కథంతా హీరో క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ, హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు ఉండేది. ఆ రోజులు మారిపోయాయి. ఇవాళ ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకూ కథలో కీలక స్థానం లభిస్తోంది. హీరోతో సమానంగా హీరోయిన్‌కూ ప్రాతినిధ్యం కనిపిస్తోంది. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్ కోసం హీరో పడే పాట్లు కూడా కనిపిస్తున్నాయి. 'అల.. వైకుంఠపురములో' అయితే హీరోయిన్ పూజా హెగ్డే కాళ్లు చూసి హీరో మనసుపారేసుకోవడం, ఏకంగా ఆమె కాళ్ల సొగసును వర్ణిస్తూ పాట పాడేసుకోవడమూ మనం చూశాం.

ఆ విషయం అలా ఉంచితే తెరపై కొత్తగా జట్టు కట్టిన హీరో హీరోయిన్ల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ కొత్త జంట స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలని తహతహలాడుతుంటారు. అప్పటికే వచ్చిన స్టిల్స్, టీజర్ లేదా ట్రైలర్‌లో వాళ్లు కనిపించిన విధానం చూసి, సినిమా ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని కాచుకొని కూర్చుంటారు. సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'లో కొత్త జంట మహేశ్, రష్మిక అలరించింది. ఈ వారమే వచ్చిన 'భీష్మ'లో నితిన్, రష్మిక జోడీ కూడా ఆకట్టుకుంది.

త్వరలో అలా ముందుకు రాబోతున్న కొత్త జంటలేవో ఓ లుక్కేద్దాం...

1. నాగచైతన్య - సాయిపల్లవి

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'లవ్ స్టోరి'లో నాగచైతన్య, సాయిపల్లవి తొలిసారి జంటగా కనిపించబోతున్నారు. ఆమధ్య విడుదల చేసిన ఆ ఇద్దరి ఇంటిమేట్ సీన్ లుక్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక టీజర్‌లో అయితే మెట్రో రైల్లో చైతూని పల్లవి ముద్దు పెట్టుకుంటే, చైతన్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వహ్వా అనిపించాయి. ఆ ఇద్దరి జోడీ చూడ ముచ్చటగా ఉందనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. ఇక వాళ్లిద్దరి 'లవ్ స్టోరి' తెరపై ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ తహతహలాడుతున్నారు. ఏప్రిల్ 2న వాళ్ల కోరిక తీరబోతోంది.

2. రామ్ - నివేదా పేతురాజ్


ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'తో తొలిసారి నభా నటేశ్, నిధి అగర్వాల్.. ఇద్దరితో జోడీ కట్టి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఇప్పుడు 'రెడ్' సినిమాలో ఏకంగా ముగ్గురు భామలతో తొలిసారి జట్టుకట్టాడు. వారిలో నివేదా పేతురాజ్‌తో అతడి జోడీ ఎలా ఉంటుందో చూడాలని అతని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆమె కాకుండా మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కూడా రామ్ సరసన కనిపించనున్నారు. రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో తయారవుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' ఏప్రిల్ 9న విడుదలవుతోంది. 

3. సాయితేజ్ - నభా నటేశ్


'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్న సాయితేజ్‌తో జత కట్టడానికి వచ్చింది నభా నటేశ్. 'ఇస్మార్ట్ శంకర్'లో తన గ్లామర్‌తో కుర్రకారుకు కిర్రెక్కించిన ఈ భామతో సాయితేజ్ తొలిసారి కలిసి నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత 'చిత్రలహరి'తో విజయాన్ని అందుకున్న సాయితేజ్, 'సోలో బ్రతుకే సో బెటర్'లో కనిపిస్తున్న విధానం ఆసక్తి కలిగిస్తోంది. నభా నటేశ్‌తో అతడి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తోన్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

4. వెంకటేశ్ - ప్రియమణి


తమిళంలో ధనుష్ టైటిల్ రోల్ చేయగా బ్లాక్‌బస్టర్ అయిన 'అసురన్' మూవీ తెలుగులో 'నారప్ప'గా రీమేక్ అవుతోంది. టైటిల్ రోల్‌ను వెంకటేశ్ చేస్తుండగా, ఆయన భార్యగా ప్రియమణి నటిస్తోంది. గమనించాల్సిన విషయమేమంటే హీరోయిన్ మంచి ఫాంలో ఉండగా వెంకటేశ్‌తో జోడీ కట్టలేకపోయిన ప్రియమణి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలిసారి ఆయన సరసన నటిస్తుండటం. ఆ ఇద్దరి జంట తెరపై ఎలా ఉంటుందో చూడాలని వెంకీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులూ ఆసక్తి కనపరుస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న 'నారప్ప' మూవీ ఈ ఏడాది సెకండాఫ్‌లో విడుదల కానున్నది.

5. విజయ్ దేవరకొండ - అనన్యా పాండే


వరుస ఫ్లాపుల తర్వాత 'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ ఫాంలోకి వచ్చిన పూరి జగన్నాథ్, లేటెస్టుగా విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా తయారవుతున్న ఈ సినిమాలో విజయ్ జోడీగా బాలీవుడ్ బాంబ్‌షెల్‌గా పేరుతెచ్చుకున్న అనన్యా పాండే నటిస్తోంది. ఇటీవలే ఆమె 'పతి పత్ని ఔర్ వో' అనే సినిమాలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సలహా మేరకే ఆమెను విజయ్ జోడీగా పూరి ఎంపిక చేశాడు. 'లైగర్' ఆమెకు ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఇందులో విజయ్, అనన్య కెమిస్ట్రీపై పూరి ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు సమాచారం. దసరా సీజన్‌లో ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది.

6. రాంచరణ్ - అలియా భట్


యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా దేశమంతా వెయికళ్లతో ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి సౌంత్ ఇండియన్ మూవీ. బాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోయిన్ అయిన ఆమె రాంచరణ్ జోడీగా కనిపించడం ప్రేక్షకులకు కన్నులపంటగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించే ఈ సినిమాలో ఆయనను పెళ్లాడాలనుకొనే సీత అనే యువతి పాత్రను అలియా చేస్తోంది. ఇదే మూవీలో కొమరం భీమ్ పాత్రను పోషిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపించనున్నది. 2021 జనవరి 8న వచ్చే 'ఆర్ఆర్ఆర్'లో ఈ రెండు జంటలు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.

7. ప్రభాస్ - పూజా హెగ్డే


ప్రస్తుతం దేశంలోని ఏకైక పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఓ డియర్'లో అతని జోడీగా తొలిసారి పూజా హెగ్డే నటిస్తోంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోన్న పూజ, ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' అల్లు అర్జున్ జోడీగా కనిపించి, అలరించి, తన ఫ్యాన్ బేస్‌ను మరింతగా పెంచుకుంది. పొడగరి అయిన ఆమె ప్రభాస్ జోడీగా పర్ఫెక్టుగా మ్యాచ్ అవుతుందనీ, తెరపై ఆ ఇద్దరి కెమిస్ట్రీ బ్రహ్మాండంగా పండుతుందనీ ఆ ఇద్దరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పైగా 'ఓ డియర్' లవ్ స్టోరీ కావడం వల్ల తెరపై ఆ ఇద్దరూ ఎక్కువసేపు కలిసి కనిపించడం వాళ్లకు పండగ లాంటిదే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ 2021 మొదట్లో విడుదల కానున్నది. 

8. అల్లు అర్జున్ - రష్మిక మందన్న


'అల.. వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో భారీ హిట్‌పై కన్నేసి సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ మూవీలో అతను తొలిసారి యంగ్ సెన్సేషన్ రష్మికా మందన్నతో జోడీ కడుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్‌తో, 'భీష్మ'తో నితిన్‌తో తొలిసారి నటించి సూపర్ హిట్లు కొట్టిన రష్మిక ఇప్పుడు బన్నీతో ఫస్ట్ టైం నటిస్తూ అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంటోంది. రొమాంటిక్ సీన్లు చెయ్యడంలో మాస్టర్ అనిపించుకున్న బన్నీ, ఈ మూవీలో రష్మికతో ఎలా రొమాన్స్ చేస్తాడో చూడాలని అతని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2021 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానున్నది.

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema GalleriesLatest News


Video-Gossips