ట్రైలర్ రివ్యూ: మిస్టర్
on Mar 23, 2017
శ్రీనువైట్ల ప్రస్తుతం పరాజయ భారంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రతిభా వంతుడైన దర్శకుడైనా.... కథల విషయంలో తప్పటడుగులు వేయడంతో శ్రీను కెరీర్ వేగం.. బాగా మందగించింది. పైగా ఆగడు, బ్రూస్లీ అంచనాలన్నీ తలకిందులు చేశాయి. పెద్ద హీరోలు మొహం చాటేసి, నిర్మాతలు స్విచ్చాఫ్ చేసుకొన్న ఫేజ్ చూసిన శ్రీనువైట్ల... ఆ పరాభవ భారం నుంచి తేరుకొని తనని తాను నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం.. మిస్టర్. ఈ సినిమా హిట్టు శ్రీనువైట్లకే కాదు, వరుణ్ తేజ్కీ చాలా అవసరం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. శ్రీనువైట్ల తన స్టైల్ నుంచి కాస్త పక్కకు తప్పుకొని, కొత్త గా ఏదో చూపిద్దామన్న ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
సినిమాకి క్లాసీ లుక్ ఉంది. మాస్‌గానూ అనిపిస్తోంది. హీరోయిజం ఉంది. లవ్ స్టోరీ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తూ... తనదైన కామెడీ మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది. ఇలా.. అన్నీ పక్కాగా కుదిరాయ్ ఈ ట్రైలర్లో. వావ్ అనిపించే షాట్స్ లేకపోయినా, ఒక్క సారి ఈ సినిమా చూస్తే తప్పేం లేదు... అన్న భరోసా అయితే కలుగుతోంది. జీవితం మనల్ని చాలా చోట్లకు తీసుకెళ్తుంది.. కానీ ప్రేమ జీవితం ఉన్న చోటికి తీసుకెళ్తుంది.. అనే ఫినిషింగ్ డైలాగ్ తప్పకుండా ఆకట్టుకొంటుంది. వరుణ్ అందంగా కనిపిస్తున్నాడు. హెబ్బా, లావణ్య ఇద్దరూ గ్లామర్ విషయంలో పోటీ పడుతున్నారు. గుహన్ కెమెరా, మిక్కీ సంగీతం, లొకేషన్లు... ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఓ హిట్టుకోసం సరైన ఫ్లాట్ ఫామ్ వేసుకొన్నాడు శ్రీనువైట్ల. ఇక ఆ రన్ వే పై పరుగు పెట్టడమే బాకీ. మిస్టర్... పరుగు ఏ స్పీడులో ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 14 వరకూ ఆగాల్సిందే.