చిరు కుమారుడి బారసాల! ఫొటోలు లోపల...
on Nov 20, 2020
దివంగత నటుడు చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ దంపతుల చిన్నారి కుమారుడి బారసాల వేడుక గతవారం మేఘన ఇంట్లో జరిగింది. ఫ్యాన్స్ జూనియర్ చిరు అని పిలుచుకుంటున్న బుడతడి తొలి వేడుక ఇదే. నవంబర్ 12న జరిగన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు మేఘన, చిరంజీవి సర్జా కుటుంబాలు ఆ బుడతడి నామకరణోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడం గురించి చర్చించుకుంటున్నాయి.
మేఘన కుమారుడి బారసాల వేడుకకు సంబంధించి ఇంతదాకా బయటకురాని ఫొటోలు ఇప్పుడు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వేడుకలో బేబీ పింక్ సల్వార్, పలజ్జో ప్యాంట్స్ ధరించారు మేఘన. ఆ పిక్చర్లలో వేడుకకు వచ్చిన అతిథులను ఆమె ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తున్నారు. ఆ బారసాల వేడుక ఫొటోలతో పాటు జూనియర్ చిరు ఫొటోలు కూడా విస్తృతంగా ఆన్లైన్లో ప్రచారంలోకి వచ్చాయి. ఆ చిన్నారిని మేఘన ముద్దుగా బేబీమా అని పిలుచుకుంటుంటే, ఆమె తండ్రి మనవడిని చింటూ అని పిలుస్తున్నారు.
బారసాల వేడుక అనంతరం తన పేరెంట్స్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు మేఘనా రాజ్. భర్త మృతి చెందాక ఆమె మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. 39 సంవత్సరాల చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటుతో జూన్ 7న ఆకస్మికంగా మృతి చెందారు.
మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆకాంక్షను మేఘన వ్యక్తం చేశారు. "నటన నా పాషన్. అది నా రక్తంలోనే ఉంది. నాకు ఇష్టమైన పనిని వదిలిపెట్టమని నా భర్త ఎప్పుడూ కోరుకోలేదు. నటించగలిగినంత కాలం సినిమాల్లో నటిస్తాను. కొంత కాలం తర్వాత కచ్చితంగా నేను నటనలోకి తిరిగొస్తాను" అని ఆమె చెప్పారు.