ఈసారైనా మణి మ్యాజిక్ చేస్తాడా??
on Apr 14, 2015

మణి రత్నం సినిమా అంటే భావోద్వేగాల వెల్లువ. ఆ టేకింగ్.. మైండ్ బ్లోయింగ్. ఆ పాటలు మణిపూసలు. వాటిని చూపించే విధానం.. అద్భుతం అనిర్వచనీయం. మణిరత్నం ప్రేమలో పడని సినీ అభిమాని లేడంటే నమ్మండి. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు అటు విమర్శకులను, ఇటు ఆయన అభిమానుల్ని మెప్పించలేకపోతున్నాయి. రావన్, కడలి సినిమాలైతే... జనాలు తలలు పట్టుకొన్నారు. మణిరత్నంలోని మ్యాజిక్ పోయిందని, ఆయన్ని ఇంకా ఎంతకాలం భరించాలని ఘాటుగా విమర్శించినవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు ఆయన నుంచి ఓకే కణ్మణి (తెలుగులో ఓకే బంగారం) సినిమా వస్తోంది. దుల్కర్ సల్మాన్, నిత్యమీనన్ జంటగా నటించారు. ఈ సినిమాపై మాత్రం అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మణి.. సఖి రేంజ్‌లో తీశాడని జనాలు నమ్ముతున్నారు. ప్రచార చిత్రాలూ, పాటలూ ఓ ఊపు ఊపేస్తున్నాయి. మణి ఈసారి.. బాక్సాఫీసు దగ్గర తన తడాఖా చూపిస్తాడని, యూత్‌ని పట్టేసే ఓ సినిమా తీశాడని విశ్వాసం కలిగింది. మణి కూడా ఈ సినిమాని అన్ని రకాలుగా జాగ్రత్త పడి తీశాడట. ఈసారి... హిట్టుకొట్టడం ఖాయం అనే ధీమా ఆయనలోనూకనిపిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు అందిస్తున్నారు. ఆయనది అసలే లక్కీ హ్యాండ్. అందుకే ఈ సినిమాకి అన్ని విధాలా శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫలించి మణి మ్యాజిక్ నిజమైతే అంతకంటే కావల్సిందేముంది?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



