ఉగాది సందడి @ టాలీవుడ్!
on Apr 5, 2019
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉగాది హడావిడి మొదలైంది. ఉగాదికి కొన్ని గంటల ముందు నుంచి కొత్త కొత్త కబుర్లు, కొత్త సినిమా కబుర్లతో సందడి చేయడం మొదలు పెట్టారు. ఉగాదికి ఒక్క రోజు ముందు అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' విడుదలైంది. 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' పరాజయాలతో విజయాల రేసులో కాస్త వెనుకబడిన నాగచైతన్యకు ఊరట ఇచ్చే సినిమా. బావుందని టాక్ రావడం, థియేటర్లలో సరైన సినిమా మరొకటి లేకపోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సినిమా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 6న 'ప్రేమకథా చిత్రమ్ 2' విడుదలవుతోంది. అసలు సిసలైన ఉగాది సందడికి కొత్త సినిమా కబుర్లతో శ్రీకారం చుడుతోంది టాలీవుడ్. ఉగాది సందర్భంగా సందడి చేస్తున్న కొత్త కొత్త సినిమా వివరాలు...
టీజర్‌తో 'మహర్షి'!
ఉగాదికి మూడు రోజుల ముందే 'మహర్షి' మేనియా మొదలైంది. ఏప్రిల్ 6న ఉగాది సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు కానుకగా 'మహర్షి' టీజర్ విడుదల చేయనున్నారని ఎప్పుడో లీకులు వచ్చాయి. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి కన్ఫర్మ్ చేశారు. ఉగాది ఉదయం 09.09 గంటలకు టీజర్ విడుదల చేస్తామని చెప్పారు. దాంతో ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మహర్షిలో మహేష్ కొత్త స్టిల్ కూడా విడుదల చేయడంతో పండగ చేసుకుంటున్నారు.
'వెంకీ మామ' టైటిల్ లోగో!
అక్కినేని అభిమానులకు 'మజిలీ' రూపంలో ఓ ఉగాది కానుక లభించింది. అక్కినేని ప్లస్ దగ్గుబాటి అభిమానులకు మరో చిరు కానుక సిద్ధమైంది. మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీ మామ' టైటిల్ లోగోను ఉగాది ముందు రోజు, శుక్రవారం విడుదల చేశారు.
లుక్‌తో బెల్లంకొండ 'రాక్షసుడు'!
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సీత' సినిమా టీజర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అలాగే, ఆ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ చేసిన 'బుల్‌రెడ్డి...' ఐటమ్ సాంగ్ కూడా. 'సీత'తో పాటు మరో సినిమాతో సందడి చేయడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నాడు. తమిళ్ హిట్ 'రాచ్చసన్' సినిమాలు రీమేక్‌గా రూపొందుతోన్న'రాక్షసుడు' సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి విడుదల చేస్తున్నారు.
'డియర్ కామ్రేడ్' రష్మిక!
'గీత గోవిందం' తరవాత మరోసారి విజయ్ దేవరకొండకు జంటగా రష్మిక నటిస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్ర బృందానికి ఇటు హీరోయిన్ పుట్టినరోజు.. అటు ఉగాది.. రెండూ కలిసి వచ్చాయి. శుక్రవారం రష్మిక పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఉగాది రెండు రోజుల తరవాత సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నారు. అలాగే, 'ఛలో' తరవాత వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న సినిమా 'భీష్మ'. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె లుక్ విడుదల చేయలేదు గానీ... క్రియేటివ్‌గా ఒక లుక్ విడుదల చేశారు.
'హలో' కల్యాణీ...
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'హలో'తో తెలుగులో కథానాయికగా పరిచయమైన మలయాళీ భామ కల్యాణీ ప్రియదర్శన్. ఏప్రిల్ 12న విడుదల కానున్న 'చిత్రలహరి'లో ఓ కథానాయికగా నటించింది. సాయిధరమ్ తేజ్ సినిమా టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే, శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ కల్యాణీ ప్రియదర్శన్ ఓ హీరోయిన్. ఆ సినిమా టీమ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇవి కాకుండా మరో కొన్ని సినిమాలు కొత్త లుక్కులు, కబుర్లతో ఉగాదికి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.