కోర్ట్ కి వెళ్లిన మగధీర నిర్మాత
on May 25, 2017

తెలుగు సినిమా వైభవాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళిది. మగధీరతో తన సత్తా చాటిన దర్శకుడు, బాహుబలితో భారతీయ సినిమాని ప్రపంచం నలుమూలలా మాట్లాడుకునేలా చేసాడు. మగధీర ని హిందీ లో తీయమని ఎంత మంది అడిగినా, తన వాళ్ళ కాదని, తీసిన సినిమాని మళ్ళీ తీసే ఓపిక లేదని ఖరాఖండీగా చెప్పాడు. నిర్మాత అల్లు అరవింద్ మగధీర ని హిందీ లో తీద్దాం అని అనుకున్నా కొన్ని కారణాల వల్ల అది సాధ్య పడలేదు. అయితే, త్వరలో రానున్న ఒక హిందీ సినిమాలో మగధీర సినిమా తాలూకు ఛాయలు ఉండడంతో కోర్ట్ ని ఆశ్రయించారు సదరు నిర్మాత. సుశాంత్ సింగ్ రాజపుట్, కృతి సనన్ నటించిన "రాబ్త" చిత్రం మగధీరకి కాపీ అనేది అల్లు అరవింద్ ఆరోపణ. నిన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో ఇంజక్షన్ ఆర్డర్ కోరుతూ కేసు నమోదు చేసారు. నోటీసు జారీ చేసిన కోర్ట్, జూన్ 1 కి అసలు సినిమా విడుదలకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తాం అని తెలిపింది. రాబ్త జూన్ 9 కి విడుదలవనున్న సంగతి మనందరికీ తెలిసిందే. రాబ్త దర్శక, నిర్మాతలకి రిలీజ్ కి ముందు ఇది ఇబ్బందికర పరిణామం. కానీ, వాళ్ళు ఇంతకు ముందే మగధీర నిర్మాతతో ఒక ఒప్పందానికి వచ్చుంటే పోయేది. చూద్దాం ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



