మహాయోధుని బయోపిక్!
on Aug 14, 2017

ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. అటు బాలీవుడ్ లోనే కాక, తెలుగులో కూడా నిజజీవిత గాధల్ని తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అయితే.. ఇదంతా... మన భారతీయ సినిమాకు సంబంధించిన విషయం.
త్వరలో హాలీవుడ్ తెరపై కూడా ఓ అద్భుతమైన బయోపిక్ తెరకెక్కనుంది. అది ఎవరి కధో కాదు. మార్షల్ ఆర్ట్స్ కి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన బ్రూస్లీ కథ. సినిమా పేరు ‘లిటిల్ డ్రాగన్’. పైగా ఈ కథను హాలీవుడ్ కు అందిస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా? మన శేఖర్ కపూర్. ఇప్పటికే ‘ఎలిజబెత్’, ‘ఎలిజబెత్.. ది గోల్డెన్ ఏజ్’ చిత్రాలను హాలీవుడ్ కి అందించిన శేఖర్ కపూర్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బ్రూస్లీ కుమార్తె షనోన్ లీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సహాయ రచయిత కూడా ఆమే.
బ్రూస్లీ బాల్యంలో ఎదుర్కొన్న జాతి వివక్ష, ఆయన ప్రేమ, స్నేహం... ఎదురైన మోసం... వీటన్నింటినీ కళ్లకు కట్టనున్నామని బ్రూస్లీ కుమార్తె షనోన్ లీ చెప్పారు.
హాంకాంగ్ లో పుట్టిన బ్రూస్లీ అమెరికా ఎందుకెళ్లాడు? మధ్యలో మార్షల్ ఆర్ట్స్ లో ఎందుకు శిక్షణ తీసుకున్నాడు? అక్కడ స్టంట్ మేన్ గా జీవితాన్ని ప్రారంభించిన బ్రూస్లీ తర్వాత కాలంలో కథానాయకునిగా ఎలా ఎదిగాడు? నిర్మాతగా ఎందుకు మారాడు? చివరకు 30 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఎందుకు కన్నుమూశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ చిత్ర కథ అని దర్శకుడు శేఖర్ కపూర్ చెప్పారు.
ఇప్పటికే హాలీవుడ్ చిత్రాల ద్వారా రెండు సార్లు ఆస్కార్ అవార్డలు అందుకున్న భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్.. ఈ చిత్రానికి సంగీతం అదించనుండటం విశేషం. బ్రూస్లీని అభిమానించే వారు ఇండియాలో కోకొల్లలు. పైగా భారతీయ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా. ఏఆర్ రెహమాన్ సంగీతం. ఈ విషయాలు చాలదూ... ఆ సినిమా ఇండియాలో కూడా బాగా ఆడటానికీ?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



