English | Telugu

వీళ్లకు అంత సీనుందా..?

on Jul 15, 2017

ప్రస్తుతం భారతీయ తెర మీద బయోపిక్ లు రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి కథాంశాల్లో నటించడం అంటే... నిజంగా ఛాలెంజే. ఇప్పటివరకూ ఎక్కువ భాగం క్రీడాకారుల బయోపిక్ లే వచ్చాయి. వచ్చిన ప్రతిదీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక సినిమా కళాకారుల బయోపక్ ల విషయానికొస్తే... సిల్క్ స్మిత నిజ జీవిత గాధ ఆధారంగా బాలీవుడ్ లో రూపొందిన ‘డర్టీ పిక్చర్’ సినిమా... వంద కోట్లు కొల్లగొట్టి.. రికార్డ్ నెలకొల్పింది. విద్యాబాలన్ కూడా ఆ పాత్రను అద్భుతంగా నటించింది. ఈ క్రమంలోనే త్వరలో మరో సినీ నటి బయోపిక్ రాబోతోంది. అదే ‘మహానటి’. మహానటి సావిత్రి రియల్ లైఫ్ ఈ సినిమా. 


సావిత్రి గా కీర్తి సురేశ్ నటిస్తోంది. విషయం ఏంటంటే... సిల్క్ స్మితగా నటిండం పెద్ద గొప్పమీ కాదు. ఎందుకంటే... నటిగా ఆమెపై ప్రజల్లో గౌరవభావం తక్కువ. ప్రజల హృదయాల్లో ఆమె మంచి నర్తకి మాత్రమే. అంతేకాదు మంచి నటి అనిపించుకునే పాత్రలు వేళ్లపై లెక్క పెట్టేవన్ని మాత్రమే చేశారామె. ఆమె రియల్ లైఫ్ కూడా కాస్తంత స్పైసీగానే సాగిందన్నది నిజం.. కానీ సావిత్రి కథ అలాంటిది కాదు. ఆమె కథలో ఎన్నో ఒడుదుడుకులు. అమాకత్వం, అభిజాత్యం ఆమె జీవితంలో అడుగడుగునా తొంగి చూస్తుంటాయ్. అమె ఎంచుకున్న రంగంలో శిఖరాన్ని ముద్దాడిన ఘన చరిత్ర సావిత్రిది. అలాగే... వ్యసనాల కారణంగా అధోగతని కూడా చూసిన హృదయ విదారకమైన కథ సావిత్రిది. వీటన్నింటినీ మించి... ఎదురు లేని మహానటి. మరి ఆమె పాత్రను చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. దర్శక, నిర్మాతలు ఆ పాత్రకు ఎంచుకున్న నటి కీర్తి సురేశ్. హీరోయిన్ గా ఆమె వయసు అక్షరాలా పదకొండు సినిమాలు. మరి ఇంత తక్కువ కాలంలో అంతటి మహానటి పాత్రకు కీర్తి న్యాయం చేయగలదా? అనేది ప్రస్తుతం సినీ ప్రియుల్ని వెంటాడుతున్న ప్రశ్న. 

ఈ కథకు ముందు దర్శకుడు నాగ అశ్విన్ అనుకున్న కథానాయిక నిత్యామీనన్. ఆమెను కలవడం కూడా జరిగింది. అయితే... నిత్య ఈ సినిమా విషయంపై వింతగా ప్రవర్తించిందని విశ్వసనీయ సమాచారం. ‘సావిత్రి కథ అంటున్నారు... అది నేను మాత్రమే చేయగలను. సో... నాకు మీరు అడిగినంత ఇవ్వాలి’అని విపరీత ధోరణిలో మాట్లాడిందట. దాంతో... దర్శకుడు నాగఅశ్విన్ చిర్రెత్తుకొచ్చి.. ‘కీర్తీ సురేశ్’ని కథానాయికగా తీసుకున్నారట. ‘ఆమె చేయలేదేమో...’ అని పలువురు అనుమానం వ్యక్తం చేసినా... ‘తను సావిత్రిగా అద్భుతంగా నటించగలదు.. ఆ బాధ్యత నాది’అని నిర్మాతలకు నచ్చజెప్పి మరీ కీర్తి సురేశ్ ని తీసుకున్నారట నాగ అశ్వన్. మరి ఆమె సావిత్రిగా ఏ మత్రం నటించగలదో చూడాలి. 

అలాగే... బాలీవుడ్ ‘క్వీన్’ఓ అద్భుతమైన చిత్రం. కంగనా రనౌత్ నట విశ్వరూపం ఆ సినిమా. బేసిగ్గా కంగనా అద్భుతమైన నటి. తాను ఓ పాత్రను ఎంచుకుందంటే...మరొకరు దాన్ని టచ్ చేయలేని స్థాయిలో నటిస్తుంది. దానికి ‘క్వీన్’ఓ ఉదాహరణ. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ‘క్వీన్’గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు టాక్. కాజల్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఉందని తెలిసింది. కాజల్ కెరీర్ ని ఒక్కసారి పరికిస్తే... తను ఇప్పటికి ఓ 50 సినిమాల్లో నటించి ఉంటుంది. అయితే... ఏ సినిమాలోనూ అద్భుతమైన నటన కనబరచే పాత్ర ఒక్కటీ చేయలేదు తను. అన్నీ గ్లామర్ రోల్సే. మరి అలాంటి కాజల్... ‘క్వీన్’గా మెప్పించగలదా? ఇది కూడా సినీ అభిమానులను వెంటాడుతున్న ప్రశ్నే. 

ఏది ఏమైనా... ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకొని అటు కీర్తీ సురేశ్, ఇటు కాజల్ ‘శభాష్’ అనిపించారు. మరి నటన పరంగా కూడా ‘శభాష్ఈ’ అనిపించగలరా? అసలు ఆ పాత్రల్ని పోషించే అర్హత వీరిద్దరికీ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం  కాలమే చెప్పాలి. 

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here