కీరవాణీ... పవన్-క్రిష్ సినిమా చేయడం లేదా?
on Sep 22, 2020
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించిన సంగీత పనులు త్వరలో పునఃప్రారంభిస్తానని సంగీత దర్శకుడు కీరవాణి చెప్పారు. ఆ సినిమా కాకుండా మరో రెండు చిత్రాలకు పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. క్రిష్ ఓన్ ప్రొడక్షన్లో ఒక సినిమా, కె. రాఘవేంద్రరావు ఓన్ ప్రొడక్షన్లో ఒక సినిమాకి సంగీతం అందిస్తున్నట్టు కీరవాణి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరి, పవన్ సినిమాకి సంగీతం అందించడం లేదా? పవర్ స్టార్ అభిమానుల్లో సందేహం వచ్చింది.
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కానీ, ఆ సంగతి ఆయన ట్వీట్ చేయలేదు. దాంతో అభిమానులు ఆయనను ట్విట్టర్లో అడగడం మొదలుపెట్టారు.
'పవన్ కల్యాణ్ - క్రిష్ మూవీ చేయడం లేదా సార్?' అని ఒకరు... '#PSPK27 కి త్వరలో అని రాసుంటే బావుండేది పెద్దాయన' అని ఇంకొకరు... 'పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడు?' అని మరొకరు... ఈ సినిమాలకు సంగీతం అందిస్తున్నానని కీరవాణి చేసిన ట్వీట్ కి మెజారిటీ రిప్లైలు పవన్ - క్రిష్ సినిమాకి సంబంధించి ఉన్నాయి. ఒకవేళ పవన్ సినిమా చేయడం లేదని పరోక్షంగా చెప్పారా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' పాటల కోసం వెయిట్ చేస్తున్నట్టు కొందరు చెప్పారు.
Also Read