పవర్‌స్టార్ బ్యానర్ నుంచి నా బ్యానర్ పేరును కాపీకొట్టా!
on Dec 12, 2019
'ఆర్ఎక్స్ 100' మూవీతో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయిన హీరో కార్తికేయ. లేటెస్టుగా '90ఎంఎల్' మూవీతో మన ముందుకు వచ్చాడు. సేఖర్రెడ్డి యెర్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆశించిన రీతిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఈ సినిమాని కూడా 'ఆర్ఎక్స్ 100' తరహాలోనే కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ అనే సొంత బేనర్‌పై నిర్మించాడు కార్తికేయ. తన బ్యానర్‌కు ఆ పేరెందుకు పెట్టాడో, ఈ మూవీని సొంతంగా ఎందుకు నిర్మించాడో 'తెలుగుఒన్'తో పంచుకున్నాడు. "ఈ కథ విన్నప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాను. కచ్చితంగా దీనికి హై ప్రొడక్షన్ వాల్యూస్ అవసరం అవుతాయని అర్థమైంది. బయటి నిర్మాత అయితే బడ్జెట్, అవీ కాలిక్యులేట్ చేసుకోవాలి. నా మార్కెట్‌ను బేరీజు వేసుకోవాలి. ఎంత పెడితే, ఎంత సేఫ్ అవుతామనే లెక్కలు ఉంటాయి. ఈ మూవీకి ఎక్కువ బడ్జెట్ అవసరం. బయటి నిర్మాతలతో చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు నాకే భయమేసింది. వాళ్లు సరిగ్గా చెయ్యకపోతే, మధ్యలో ఏవన్నా ప్రాబ్లెమ్స్ వచ్చి ఆగితే ఎలా? అనిపించింది. ఒకవేళ చేసినా అనుకున్నట్లు బిజినెస్ కాకపోతే ఆ గిల్ట్ నేను తీసుకోలేను. దాంతో దీన్ని మనమే ప్రోపర్గా టేకప్ చేద్దామనుకున్నాం. ఆ ఒక్క రీజన్‌తోనే నేను ప్రొడ్యూస్ చేద్దామని నిర్ణయించుకున్నా" అని చెప్పాడు 27 ఏళ్ల కార్తికేయ.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి కాపీ కొట్టి తన బ్యానర్‌కు కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ అని పెట్టానని అతను తెలిపాడు. "బ్యానర్‌కు ఏ పేరు పెడదామని అనుకున్నప్పుడు.. నిజానికి మొదట అమ్మ పేరో, అక్క పేరో పెడదామని అనుకున్నా. అయితే ఏ అక్షరంతో బ్యానర్ పేరు మొదలు పెట్టాలనే విషయాన్ని డాడీ బాగా నమ్ముతారు. ఆయన 'కె' లెటర్‌తోనే బ్యానర్ పేరు మొదలవ్వాలని పక్కాగా చెప్పారు. మా ఇంట్లో నేను తప్ప ఆ అక్షరంతో మొదలయ్యేవాళ్లు ఎవరూ లేరు. దాంతో నాపేరుతోటే బ్యానర్ పేరును పెట్టాలనుకున్నా. మన హీరోల్లో ఎవరికి సొంత బేనర్లు ఉన్నాయని సెర్చ్ చేశా. 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' కనిపించింది. పవర్ స్టారే పెట్టుకున్నాడు కదా, మనం ఎందుకు పెట్టుకోకూడదు అనిపించింది. దాంతో 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' అనే పేరును మా ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఇంతదాకా ఈ విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలీదు. మీకే మొదటిసారి చెప్తున్నా. '90ఎంఎల్' మూవీకి నా డబ్బులతో పాటు మా ఫ్యామిలీ డబ్బులు కూడా పెట్టాం. మొత్తం నేనే పెట్టేంత సంపాదించలేదు. ఇప్పటిదాకా నాకు ఏవైతే రెమ్యూనరేషన్లు వచ్చాయో అవన్నీ పెట్టేశా" అని చెప్పుకొచ్చాడు కార్తికేయ.