English | Telugu

కిక్కిచ్చే టైటిల్‌తో మళ్లీ వస్తున్నానంటున్న 'ఆర్ఎక్స్ 100' హీరో!

on Sep 5, 2019

 

హీరోగా నాలుగు సినిమాలు.. మూడు ఫ్లాపులు, ఒక్కటే హిట్టు. అయినా కార్తికేయ గుమ్మకొండ యూత్‌లో క్రేజ్ ఉన్న స్టారే. ఒకే ఒక్క సినిమా 'ఆర్ఎక్స్ 100'తో అతను రాత్రికి రాత్రే సెన్సేషనల్ హీరో అయిపోయాడు. అది అతనికి రెండో సినిమా. ఆ మూవీని నిర్మించింది అతని సొంత ప్రొడక్షన్ హౌసే. రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్టర్‌గా పరిచయమైంది ఆ సినిమాతోటే. ఇప్పుడు మరోసారి సొంత బేనర్‌లో సినిమా చేస్తున్నాడు కార్తికేయ. 

"కిక్కిచ్చే టైటిల్‌తో మళ్లీ ఒచ్చేస్తున్నాం.. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నుంచి 'ఆర్ఎక్స్ 100' వంటి సెన్సేషనల్ మూవీ తర్వాత మా రెండో ప్రొడక్షన్‌ను లాన్ చెయ్యడానికి ఇదే సమయం. ఆ క్రేజీ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌నూ మీతో షేర్ చేసుకోవడానికి వెయిట్ చెయ్యలేకపోతున్నా" అని అతను ట్వీట్ చేశాడు. టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ నెల 9న అనౌన్స్ చెయ్యనున్నట్లు అతను తెలిపాడు. ఈ సందర్భంగా అతను షేర్ చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఒక బీరు బాటిల్, దాని పక్కనే పిల్లలు పాలు తాగే పాల పీక ఉన్న బాటిల్, అందులో పాలకు బదులు బీరు, దాన్ని అందుకోబోతున్న ఓ శిశువు చెయ్యి.. ఇదీ ఆ పోస్టర్!

శేఖర్‌రెడ్డి యెర్రా రచించి, దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా జె. యువరాజ్ పనిచేస్తుండగా, ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

2017లో 'ప్రేమతో మీ కార్తీక్'తో హీరోగా పరిచయమైన కార్తీక్.. రెండో సినిమా 'ఆర్ఎక్స్ 100'తో సూపర్ హిట్ సాధించాడు. ఆ తర్వాత అతను చేసిన 'హిప్పీ', 'గుణ 369' సినిమాలు ఫ్లాపయ్యాయి. త్వరలో విలన్‌గా 'నానీస్ గ్యాంగ్ లీడర్'లో కనిపించబోతున్నాడు.


Cinema GalleriesLatest News


Video-Gossips