English | Telugu

'జార్జిరెడ్డి' మూవీ రివ్యూ

on Nov 22, 2019

 

తారాగణం: సందీప్ మాధవ్ (శాండీ), ముస్కాన్, సత్యదేవ్, దేవిక డఫ్తర్‌దర్, మనోజ్ నందం, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, మహతి, శ్రీనివాస్ పోకలే
సంగీతం: సురేశ్ బొబ్బిలి
బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సుధాకర్ యెక్కంటి
ఎడిటింగ్: ప్రతాప్‌కుమార్
ఆర్ట్: గాంధీ నడికుడికార్
సహ నిర్మాత: సంజయ్‌రెడ్డి
నిర్మాత: అప్పిరెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జీవన్‌రెడ్డి
బ్యానర్స్: మైక్ మూవీస్, సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సినిమా
విడుదల తేదీ: 22 నవంబర్ 2019

తెలుగునాట విద్యార్థి ఉద్యమానికి ఊపిరినిచ్చిన ధీరుడిగా జార్జిరెడ్డికి చరిత్రలో స్థానం ఉంది. జార్జిరెడ్డి వ్యక్తిత్వం, అన్యాయాన్ని నిలదీసే ధైర్య సాహసాలు, చావుకు వెరవని స్థైర్యం నాటి విద్యార్థులకు, యువతకు స్ఫూర్తినిచ్చిందని చదువుకున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని 'స్టోరీ ఆఫ్ ఎ ఫర్‌గాటెన్ హీరో' అంటూ తీసుకు వస్తున్నారనేసరికి 'జార్జిరెడ్డి' పేరును, అతని సాహసాలను వినివున్న వాళ్లతో పాటు, ఎవరీ జార్జిరెడ్డి అంటూ ఆసక్తి కనపర్చిన వాళ్లంతా ఆత్రుతతో ఎదురుచూసిన 'జార్జిరెడ్డి' మూవీ మనముందుకు వచ్చింది. ఇదివరకు 'దళం' అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు పొందిన జీవన్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు డైరెక్షన్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ సుధాకర్‌రెడ్డి యెక్కంటి సినిమాటోగ్రఫీ అందించాడు.

కథ:- 

బాల్యాన్ని తల్లితో పాటు కేరళలో గడిపిన జార్జిరెడ్డి (సందీప్ మాధవ్), ఎమ్మెస్సీ చదవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం కలిగిన అతను యూనివర్సిటీలో అగ్ర కులాల విద్యార్థుల చేతుల్లో పేద విద్యార్థులు, నిమ్న కులాల విద్యార్థులు పడుతున్న బాధలు చూసి ఆగ్రహంతో రగిలిపోతాడు. అగ్ర కులాల విద్యార్థులను ఎదిరించి, వాళ్లను చితగ్గొడతాడు. అతడి ధైర్యం, గుండె నిబ్బరం చూసి, అక్కడ అణచివేతకు గురవుతున్న ఒక వర్గం విద్యార్థులంతా అతడి పక్షం చేరతారు. అంతదాకా అక్కడ ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న రెండు పార్టీల విద్యార్థి నాయకులకు జార్జిరెడ్డి కొరకురానికొయ్యగా మారతాడు. యూనివర్సిటీలో తన తమ్ముడు లల్లన్ సింగ్ పెత్తనాన్ని సవాలుచేసి, అతడిని కొట్టిన జార్జిరెడ్డిపై లోకల్ దాదా కిషన్ సింగ్ (శత్రు) తన మనుషులతో హత్యాయత్నం చేయిస్తాడు. 22 కత్తి పోట్లకు గురై కూడా జార్జిరెడ్డి ఒక్కడే డజను మంది దాకా ఉన్న గూండాలను ఎదిరించి తరిమికొడతాడు. విద్యార్థి ఎన్నికల్లో జార్జిరెడ్డి 'పిఎస్' అనే కొత్త పార్టీపెట్టి గెలుస్తాడు. జార్జి చేసిన అవమానంతో యూనివర్సిటీలో తలెత్తుకోలేకపోతున్నానని భావించిన లల్లన్ సింగ్ (తిరువీర్) ఏం చేశాడు? జార్జిని చంపాలనుకున్న అతడి పథకం ఫలించిందా? అనేది క్లైమాక్స్.

అనాలిసిస్:-

జార్జిరెడ్డి బయోపిక్‌గా ఊహించుకొని వెళ్లినవాళ్లను ఆదిలోనే 'ఇది జార్జిరెడ్డి జీవితంలో జరిగిన ఘటనలను ఆధారం చేసుకొని తీసిన కల్పిత కథ. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు' అని చూపి నిరుత్సాహపరిచారు. ఇది జార్జిరెడ్డి బయోపిక్ కాదని మేకర్సే ఒప్పుకున్నాక, దీన్ని జార్జిరెడ్డి జీవితంగా ఎలా భావిస్తాం! ఎలా జార్జిరెడ్డి పాత్రతో ఎమోషనల్‌గా కనెక్టవుతాం! విడుదల విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండటానికీ, కొన్ని వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతలు, నిరసనల నుంచి తప్పించుకోడానికీ దర్శకుడు, నిర్మాతలు రాజీపడి 'జార్జిరెడ్డి'ని ఒక మామూలు సినిమాగానే మన ముందుకు తీసుకొచ్చారు!! అందుకని మనం కూడా దీన్ని ఒక సాధారణ సినిమాగానే చూడాలి, పరిగణించాలి. కాకపోతే జార్జిరెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఈ సినిమా గుర్తుచేస్తుందంతే.

అప్పట్లో జార్జిరెడ్డి 'ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్' (పీడీఎస్‌యూ) అనే యూనియన్‌ను నెలకొల్పాడని మనం చదువుకున్నాం. ఆ పీడీఎస్‌యూను ఈ మూవీలో 'పీఎస్'గా మార్చారు. 'పీఎస్' అంటే ఏమిటో మాత్రం చెప్పలేదు. 'ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్' అని మనమే అర్థం చెప్పుకోవాలి. జార్జిరెడ్డిది ఎంతటి గుండెధైర్యమో చెప్పడానికి చిన్నతనం నుంచే అతడిలో ఆ లక్షణాలు కనిపించాయన్నట్లు చూపించారు. తనకంటే పెద్దవాళ్లను కొట్టడానికి కూడా అతడు వెనకాడేవాడు కాదనీ, ఆ విషయంలో అతడికి తల్లి కూడా అడ్డు చెప్పకుండా, భగత్ సింగ్, చేగువేరా కథల్ని చెబుతూ, అతడిలో విప్లవ భావాలు పెంపొందేలా చేసిందనీ చూపించారు.

సినిమా పూర్తయ్యాక.. ఒక్కసారి ఏం చూశామని అవలోకనం చేసుకుంటే.. 60 ప్లస్ సన్నివేశాల్ని గుదిగుచ్చి, ఒక కథగా మనకు చెప్పడానికి డైరెక్టర్ జీవన్‌రెడ్డి ప్రయత్నించాడని అనిపిస్తుంది. చాలా సన్నివేశాల మధ్య లింకులు మిస్సయ్యాయి. చదువులో బ్రిలియంట్ అయిన జార్జిరెడ్డిని ఒక యారోగెంట్ అండ్ కరేజియస్ స్టూడెంట్ లీడర్‌గా ప్రొజెక్ట్ చెయ్యాలనే తాపత్రయంలో కథకు కావాల్సిన 'ఆత్మ'ను మర్చిపోయాడు. జార్జిరెడ్డి పాత్ర ప్రయోజనం ఏమిటి? దేనికోసం అతను పోరాడుతున్నాడు? అనే విషయాన్ని ప్రధానంగా తీసుకొని, దానిచుట్టూ కథ నడిపితే, ఆ కథలో ఒక ఎమోషన్ క్యారీ అయ్యేది. ఒక యాక్షన్‌కు జార్జిరెడ్డి తక్షణ రియాక్షన్‌ను హైలైట్ చేస్తూ, ప్రేక్షకుడిలో భావోద్వేగాలు రేకెత్తించాలనే ఉద్దేశం దర్శకుడిలో కనిపించింది. క్లైమాక్స్ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చూపి, ప్రేక్షకుడి సానుభూతిని ఆశించడం కూడా దానిలో భాగమే. సినిమా అయ్యాక మనకు ఎక్కువగా గుర్తుండేది కూడా ఆ క్లైమాక్సే. 

సినిమా అంతా సీరియస్ టోన్‌లో ఉంటే కమర్షియల్‌గా ఎలా ఉంటుందని సందేహించారేమో, 'మాయ' (ముస్కాన్) అనే హీరోయిన్‌ను, ఒన్‌సైడ్ లవ్‌నూ కల్పించారు. జార్జిరెడ్డిని ఆ మాయ ప్రేమిస్తుంది. దాన్ని జార్జి దగ్గర వ్యక్తం చెయ్యాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. నిజానికి 'జార్జిరెడ్డి' కథను ప్రేక్షకులకు చెప్పేది ఆ మాయ మనవరాలు ముస్కాన్ (ముస్కాన్). అంటే అమ్మమ్మ (నాయనమ్మ కూడా కావచ్చేమో), మనవరాళ్లుగా ముస్కాన్ డ్యూయల్ రోల్ చేసిందన్న మాట.

'కల్పిత' కథ కదా.. ఇలాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు!!. ఒక అమెరికన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం జార్జిరెడ్డి జీవితాన్ని పరిశోధించడానికి ఇండియాకు ముస్కాన్ బయలుదేరడంతో 'జార్జిరెడ్డి' కథ మొదలవుతుంది. కథలో జార్జిరెడ్డి ఒక రివాల్వర్ దగ్గర పెట్టుకుంటాడు. నాలుగైదు సన్నివేశాల్ని ఆ రివాల్వర్‌పై ఫోకస్ చేశారు. ఇంతకీ ఆ రివాల్వర్ ప్రయోజనం ఏమిటి? నథింగ్. ఆ రివాల్వర్‌ను జార్జిరెడ్డి ఎక్కడా వాడడు. వాడివుంటే కథ ఇంకోలా ఉండేదని ఒక డైలాగ్ మాత్రం చెప్పించారు. కొన్ని పాత్రలు ఏమిటో, ఎందుకొస్తాయో తెలీదు. ముఖ్యంగా వినయ్ వర్మ పోషించిన పాత్ర. ఆయన ఈ సినిమాలో చేసిన పాత్ర ఏమిటి? సినిమాకి మేజర్ ఎస్సెట్ సుధాకర్ యెక్కంటి సినిమాటోగ్రఫీ. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది.. 1960, 70 కాలాల నాటి వాతావరణాన్ని తీసుకొచ్చిన గాంధీ నడినుడికార్ కళా దర్శకత్వం.

ప్లస్ పాయింట్స్:

సినిమాటోగ్రఫీ
కళా దర్శకత్వం
డైలాగ్స్
జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ నటన

మైనస్ పాయింట్స్:

కథలో 'ఆత్మ' లోపించడం
సినిమాకి కీలకమైన ఎమోషన్ క్యారీ కాకపోవడం
ఎడిటింగ్
కొన్ని పాత్రలు అర్థవంతంగా లేకపోవడం

నటీనటుల అభినయం:- 

నిస్సందేహంగా ఇది సందీప్ మాధవ్ అలియాస్ శాండీ సినిమా. జార్జిరెడ్డిగా శాండీ చక్కని నటన కనపరిచాడు. తన పాత్రకు సంబంధించినంతవరకు అతడు నూటికి 90 శాతం న్యాయం చేశాడు. స్వతహాగా బేస్ వాయిస్ కాకపోవడంతో హైపిచ్‌లో చెప్పాల్సిన డైలాగ్స్‌ని ఆ స్థాయిలో చెప్పలేకపోవడం ఒక్కటే అతడికి సంబంధించిన ఫిర్యాదు. మిగతా అన్ని సన్నివేశాల్లో రాణించాడు. క్లైమాక్స్‌లో అతడు ప్రేక్షకుల సానుభూతిని పొందుతాడు. 'ఏబీసీడీ' యూనియన్ నేతలు సత్య, అర్జున్‌గా సత్యదేవ్, మనోజ్ నందం పాత్రల్లో డెప్త్ లేదు. అందువల్ల నటించడానికి వాళ్లకు అవకాశం రాలేదు. క్యాంటిన్ నడిపే స్టూడెంట్‌గా, ఒక వర్గం విద్యార్థులకు లీడర్ అయిన కౌశిక్‌గా పాత్ర పరిధి మేరకు నటించాడు చైతన్యకృష్ణ. జార్జిరెడ్డికి కుడిభుజంగా ఉంటూ, విపరీతంగా ఆవేశపడే రాజన్న పాత్రలో అభయ్ గుర్తించుకోదగ్గ నటన చూపాడు. ఈ పాత్ర తర్వాత అతనికి రాబోయే రోజుల్లో మంచి పాత్రలు లభిస్తాయని ఆశించవచ్చు. అలాగే లల్లన్ సింగ్‌గా నటించిన తిరువీర్ కూడా ఆకట్టుకున్నాడు. కిషన్ సింగ్ పాత్రల లాంటివి శత్రుకు కొట్టినపిండే. అలవాటైన పనిని సులువుగా చేసినట్లు అతను ఆ పాత్రను ఈజీగా చేసేశాడు. మాయ పాత్రలో ముస్కాన్ ఆకట్టుకోలేకపోయింది. ఆమె మాట్లాడే తెలుగును భరించడం కష్టం. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చిన్నప్పటి జార్జిరెడ్డిగా చేసిన చిన్నారి మరాఠీ నటుడు శ్రీనివాస్ పోకలే అభినయం గురించి. ఉత్తమ స్థాయి నటనతో అలరించాడు. మౌనంగా హావభావాలు ప్రదర్శించే జార్జిరెడ్డి తల్లిగా మరాఠీ తార దేవిక సరిపోయింది.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో' అని నినదించి, ఆ నినాదాన్నే తన జీవన విధానంగా చేసుకున్న జార్జిరెడ్డి కథను సెల్యులాయిడ్‌పై అద్భుతంగా కాకపోయినా, ఉన్నత స్థాయిలో ఆవిష్కరించి ఉంటారని ఆశించి వెళ్లినవాళ్లని పాక్షికంగా మాత్రమే సంతృప్తిపరచే సినిమా 'జార్జిరెడ్డి'.

రేటింగ్: 2.5/5

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.