సామ్‌కు అది.. ఏడాదికొకటైనా ఉండాల్సిందే!
on Apr 22, 2020
సమంత.. తెలుగుతెర కుందనపు బొమ్మ. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతూ.. నటిగా ఎప్పటికప్పుడు ఎదిగిపోతూ.. ముందుకు సాగుతోందీ అక్కినేని వారింటి కోడలుపిల్ల. అలాంటి సామ్ కెరీర్‌ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. గత ఐదేళ్ళుగా ఏడాదికో రీమేక్‌లో సందడి చేయడం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అవన్నీ కూడా వేర్వేరు భాషా చిత్రాలకు చెందిన రీమేక్స్ కావడం.
1973 నాటి తెలుగు చిత్రం ‘మీనా’కి రీమేక్ వెర్షన్ అయిన ‘అ ఆ’తో 2016లో అలరించిన సామ్.. 2017లో ‘రాజు గారి గది 2’తో సందడి చేసింది. మలయాళ చిత్రం ‘ప్రేతమ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక 2018లో రిలీజైన సామ్ ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘యూటర్న్’.. అదే పేరుతో తయారైన కన్నడ చిత్రం ‘యూటర్న్’కి తెలుగు రూపం. అలాగే, సమంతలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించిన గత ఏడాది చిత్రం ‘ఓ బేబీ’.. కొరియన్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’కి టాలీవుడ్ వెర్షన్. అదే విధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చిన ‘జాను’.. కోలీవుడ్ క్లాసిక్ ‘96’కి రీమేక్. మొత్తమ్మీద 2016 నుంచి 2020 వరకు తెలుగు, మలయాళం, కన్నడం, కొరియన్, తమిళం.. ఇలా వేర్వేరు భాషలకు చెందిన సినిమాల రీమేక్స్‌లో సమంత సందడి చేసిందన్నమాట.
ఇదిలా ఉంటే.. ఏడాదికో రీమేక్ అయినా తన ఖాతాలో ఉండాల్సిందే అన్నట్టుగా సాగుతున్న సామ్.. తాజాగా మరో రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఓ బాలీవుడ్ ఫిల్మ్ ఆధారంగా తెరకెక్కనున్న హారర్ కామెడీ ఇదని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని వినిపిస్తోంది.
మొత్తంగా.. జయాపజయాలకు అతీతంగా ‘రీమేక్ చైన్’ని భలేగా సెట్ చేసుకుంటోంది ‘వైఫ్ ఆఫ్ చై (అక్కినేని నాగచైతన్య)’.
Also Read