ఎర్రబస్సు రివ్యూ: అనుబంధాల ప్రయాణం
on Nov 14, 2014

మన సినిమాల్లో అన్నీ ఉంటున్నాయి..
కాకపోతే.. అక్కర్లేనివే ఎక్కువ.
మనకు కావల్సిన, మనవైన అనుబంధాల్ని వెదికిపట్టుకొనే తీరిక ఎవ్వరికీ లేదు. ఎలాంటి ఎలిమెంట్స్ జోడిస్తే.. సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందో లెక్కలేసి మరీ అతికించేస్తున్నారు. డాన్సులు, ఫైటింగులు, హీరోయిజం, పంచ్ డైలాగులూ, ఐటెమ్ సాంగ్ వీటి చుట్టూ కథలు తిరుగుతున్నాయి. కథలు నేల విడిచి సాము చేస్తున్నాయ్. గాల్లో విమానంలా ఎగురుతున్నాయ్. పల్టీలు కొడుతున్నాయ్. వాటిని నేల మీద దించి.. విమానాన్ని ఎర్రబస్సుగా మార్చారు దాసరి నారాయణరావు. తాతమనవళ్ల అనుబంధం, దాని విలువ ఈ తరానికి అందించే ప్రయత్నం చేశారు. మరి ఈ అనుబంధాల ఎర్రబస్సు సాగిన తీరు ఎలాంటిది?? మలుపులెన్ని..??
రాజేష్ (మంచు విష్ణు) హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తాతయ్య నారాయణ రావు(దాసరి నారాయణ రావు ) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచీ తాతయ్య దగ్గరే పెరిగాడు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. రాజేష్ కి ఓ కల ఉంది. అదేంటంటే.. అమెరికా వెళ్లాలి. అక్కడే స్థిరపడిపోవాలి. అందుకోసం కష్టపడుతుంటాడు. ఈలోగా రాజీ (కేథరిన్)ని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా రాజేష్‌ని ప్రేమిస్తుంది. ఈలోగా రాజేష్‌కి అమెరికా వెళ్లే ఛాన్స్ వస్తుంది. మూడు నెలల్లోగా అమెరికా వెళ్లిపోవాలి. అందుకే ఈలోగా తాతయ్యని హైదరాబాద్ తీసుకొచ్చి.. నగరం అంతా తిప్పి చూపించాలనుకొంటాడు. తాత కూడా హైదరాబాద్ వస్తాడు. తనదంతా ముక్కుసూటి వ్యవహారం. కళ్లముందు అన్యాయం జరుగుతుంటే సహించడు. అన్నీ పల్లెటూరి అలవాట్లే. కల్మషం లేని మనసు. తాతయ్య చేసే చేష్టలతో అపార్ట్‌మెంట్‌లో అవస్థలు ఎదురవుతాయి. తాతయ్య మాటలు, వాలకం... రాజీకి కూడా నచ్చవు. తాతయ్యని పాలకొల్లు పంపేస్తావా? లేదా? అని రోజూ గొడవకు దిగుతుంటుంది. ప్రతిసారీ తాతయ్యని వెనకేసుకువస్తుంటాడు రాజేష్. ఓసారి రాజేష్ కష్టపడి చేసుకొన్న పోగ్రామ్స్ ఫైల్ తాతయ్య వల్ల నాశనం అవుతాయి. అమెరికా వెళ్లే ఛాన్స్ కోల్పోతాడు. అంతేకాదు రాజీకీ దూరమవుతాడు. అలాంటప్పుడు రాజేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు?? తాతయ్య తీసుకొన్న నిర్ణయం ఏమిటి?? రాజేష్, రాజీ కలుసుకొన్నారా? రాజేష్ అమెరికా కల నెరవేరిందా? అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తుల మనస్తత్వాలేంటి? వాటిని ఎలా సరిదిద్దాడు?? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఎర్రబస్సు చూడాలి.
తమిళ సినిమా మంజపై కి ఇది రీమేక్. నిజానికి దాసరికి తెలియని కథలు కావివి. ఆయన చేయని సినిమా కాదిది. ఇలాంటి కథల్లో ఆయనకు పట్టుంది. తాతమనవళ్లు అనుబంధం, వాటిని తెరకెక్కించిన విధానం నచ్చి, మంజపైని తీసుకొని ఉంటారు. అయితే ఆ కథలో తగిన మార్పులు చేశారు. క్లైమాక్స్‌ని తప్ప.. మిగిలిన సినిమా అంతా దాసరి మార్చుకొని, తన శైలిలో తెరకెక్కించారు. తాత, మనవడు మధ్య అల్లుకొన్న సన్నివేశాలు, అపార్ట్‌మెంట్ జీవితాలు, తాతయ్య అమాయకత్వం, మనవడిపై చూపించే ప్రేమ.. ఇలాంటి సన్నివేశాలు దాసరి చాలా కన్వినెన్స్‌గా తెరకెక్కించారు. అమాయకత్వం నుంచి వినోదం పుడుతుంది. ఈ యాంగిల్‌ని ఆయన వాడుకొన్న విధానం బాగుంది. సినిమా అంటే ఇన్ని సన్నివేశాలకు ఓ పాట, ఆ తరవాత ఫైటూ రావాల్సిందే అనే లెక్కలున్నాయ్. వాటిని ఈ సినిమా పక్కన పెట్టింది. కథకు ఏం కావాలో అదే చేశారు. ఈసినిమాలోనూ ఫైట్స్ ఉన్నాయ్. కాకపోతే అవి దాసరి చేసినవి. పల్లెటూరి తాతయ్య దెబ్బ రుచి చూపించారు.
కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం బాగా తగ్గించారు. వాళ్లందరినీ దారి మళ్లించాలంటే ఇలాంటి సినిమాలు రావాల్సిందే. ఎక్కడా అసభ్యతగానీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌గానీ లేకుండా దాసరి క్లీన్ సినిమాగా తీర్చిదిద్దారు. బ్రహ్మానందం - కాకి ఎపిసోడ్‌తో ఈతరం ప్రేక్షకులనూ సంతృఫ్తి పరిచే ప్రయత్నం చేశారు. పతాక సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బలం. మనసుని టచ్ చేస్తారు దాసరి. పట్నపు వాసుల బతుకులు ఎలా ఉన్నాయి? వారి మనసు ఎంత ఇరుకు.. అనే విషయాల్ని వ్యంగ్య ధోరణిలోనే సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు.
విష్ణుకి ఇది కొత్త పాత్ర. డీసెంట్‌గా నటించాడు. డైలాగులు చెప్పేటప్పుడు మోహన్‌బాబుని అనుకరించే ప్రయత్నం మరోసారి చేశాడు. కేథరిన్ కూడా ఓకే అనిపించుకొంటోంది. అయితే ఎంతమంది ఉన్నా.. ఈ సినిమాని తానొక్కడై నడిపించేశారు దాసరి. తాతయ్యగా ఆయన నటన అందరినీ కట్టిపడేస్తుంది. మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో. దాసరి ఎంత మంచి నటుడన్న విషయం ఈ సినిమా మరోసారి రుజువు చేస్తుంది. మిగిలిన వాళ్లకు అంత స్కోప్ లేదు. ఉన్నంతలో నాజర్ మెప్పిస్తారు.
చక్రి అందించిన పాటలు బాగున్నాయి. విజయ్ ఏసుదాస్ పాడిన పాట, సీమంతం గీతం, తాతయ్యా.. తాతయ్య పాటలు ఆకట్టుకొంటాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగినట్టే ఉంది. సినిమా నిడివి కూడా తక్కువే. బోర్ కొట్టకుండా తగిన జాగ్రత్తలన్నీ తీసుకొన్నారు. ఎర్రబస్సు.. అనుబంధాలు ఇష్టపడేవాళ్లకు ఇది హైవేపై ప్రయాణం చేయించే సినిమా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



