English | Telugu

'సీనయ్య'గా వినాయక్ నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ

on Oct 9, 2019

 

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన వి.వి. వినాయక్ హీరోగా వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యాడు. 'సీనయ్య' పేరుతో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. డైరెక్ట‌ర్ శంకర్ శిష్యుడు నరసింహ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రారంభమైంది. అన్నపూర్ణా స్టూడియోస్‌లో వినాయక్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. టాప్ డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేశారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "నేను డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు వినయ్‌తో నా జర్నీ 'ఆది'తో స్టార్ట్ అయింది. ఆ తరువాత మా సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ స్థాపించిన త‌ర్వాత తొలి సినిమాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే 'దిల్' సినిమా చేశాం. ఆ సినిమా పేరే నా ఇంటి పేరుగా మార్చేంత పెద్ద సినిమా అయ్యింది. డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన న‌ర‌సింహ చెప్పిన 'సీనయ్య' క‌థ న‌చ్చింది. 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌. ఇది సీన‌య్య అనే వ్య‌క్తి క‌థ‌. కంప్లీట్ ఎమోష‌న‌ల్ స్టోరీ. క‌థ న‌చ్చ‌డంతో ఎవ‌ర్ని హీరోగా అనుకుంటున్నావ‌ని అడిగితే.. చిన్న‌గా చేద్దామ‌ని అనుకుంటున్నాను సార్‌! అని చెప్పాడు. అలా తీస్తే ఈ సినిమా రీచ్ కాదు. దీనికి స‌మ్‌థింగ్ మ్యాజిక్ జ‌ర‌గాలని చెప్పి.. ఎవ‌ర్నైనా డైరెక్ట‌ర్‌ని హీరోగా చేద్దామ‌ని అనుకున్నాం. అస‌లు ప్రాక్టికల్‌గా వీల‌వుతుందా? అనే సందిగ్ధంలో ఆగిపోయాను. ఆ స‌మ‌యంలో నా సినిమాల‌కు ప‌నిచేసిన ద‌ర్శ‌కుల గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు స‌డెన్‌గా వినాయ‌క్ స్ఫురించాడు. అస‌లు ఈ సినిమాను విన‌య్‌తోనే చేయించాలి క‌దా! అనుకున్నాను. అదే విష‌యాన్ని న‌ర‌సింహారావుకు కూడా చెప్పాను. త‌ను చాలా ఎగ్జ‌యిట్ అయ్యాడు. త‌ర్వాత వినాయ‌క్‌ని క‌లిసి 'ఇలా ఓ క‌థ ఉంది.. ముందు క‌థ విను' అని చెప్పాను. విన‌య్ క‌థ విని, 'అన్నా!.. నీది రైట్ సెల‌క్ష‌న్‌.. నేను యాక్ట్ చేస్తున్నాను' అని చెప్పాడు. తిరుమ‌ల‌లో ఉన్న నేను అక్క‌డే సినిమా గురించి అనౌన్స్ చేశాను. డైరెక్ట‌ర్‌ని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు ఏంటి?.. అనే క్యూరియాసిటీ, క్వ‌శ్చ‌న్ మార్క్ ఉండేది. ఫ‌స్ట్ లుక్ త‌ర్వాత, భ‌లే ఉంది.. అని అంద‌రూ అనుకున్నారు. షూటింగ్ మొద‌లు పెట్టేసి స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. ఈ సినిమా కోసం డెడికేష‌న్‌తో వినయ్ నాలుగు గంట‌ల పాటు జిమ్ చేస్తున్నాడు. స్లిమ్‌గా త‌యార‌య్యాడు. వచ్చే స‌మ్మ‌ర్‌లో మంచి సినిమాను చూపిస్తాం" అన్నారు. 

హీరోగా మారుతున్న వినాయక్ మాట్లాడుతూ "డెస్టినీ నాకు కూడా వింత‌గా ఉంది. రాజుగారు ఓ రోజు వ‌చ్చి 'నువ్వు న‌న్ను దిల్‌ రాజుని చేశావ్‌.. నేను నిన్ను హీరోని చేద్దామ‌నుకుంటున్నానని అన్నాడు. ఓ స్క్రిప్ట్ విన్నాను. నువ్వు అయితే బావుంటావు. చెయ్ బావుంటుంద‌'ని అన్నాడు. 'నాకు కామెడీ, పాట‌లు, డ్యాన్సులు వ‌ద్దు.. హుందాగా ఉంటేనే చేస్తాన‌'ని చెప్పాను. 'అలాంటి క‌థే' అని రాజు అన్నారు. త‌ర్వాత న‌రసింహ వ‌చ్చి నాకు ఈ క‌థ‌ను చెప్పాడు. ఓ క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకున్న ఓ బ‌యోపిక్‌ లాంటి కథ. త‌ను నెరేట్ చేసేట‌ప్పుడే ఆ క్యారెక్ట‌ర్‌ను త‌నెంతగా ఇష్ట‌ప‌డ్డాడో తెలిసింది. కొంత స‌మ‌యం అడిగి పాత్ర కోసం బ‌రువు త‌గ్గాను. ఎస్‌వీసీ బ్యాన‌ర్ అంటే నా బ్యాన‌ర్ అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఇంట్లో బ్యాన‌ర్ నుండి నేను హీరోగా చేస్తున్నాను. ఫ‌స్ట్ లుక్ బావుంద‌ని అభినందించిన అంద‌రికీ థ్యాంక్స్‌" అని చెప్పారు. 

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రచన: 'డార్లింగ్' స్వామి, హరి, బాలశేఖరన్, ఛాయాగ్రహణం:బ్సాయి శ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: కిరణ్ కుమార్, నిర్మాతలు: రాజు, శిరీష్, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: నరసింహ.


Cinema GalleriesLatest News


Video-Gossips