అక్కడ్నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లిన సిరాజ్!
on Jan 21, 2021
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌తోటే టెస్ట్ అరంగేట్రం చేసి, తొలి సిరీస్‌లోనే అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గురువారం హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో అతనికి సాదర స్వాగతం లభించింది. అభిమానులు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంటికి కూడా వెళ్లకుండా సిరాజ్ నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి ఆయనకు నివాళులర్పించాడు.
ఇటీవలే సిరాజ్ తండ్రి మృతి చెందారు. ఆ సమయానికి సిరాజ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపికై ఆస్ట్రేలియాకు వెళ్లి కొద్ది రోజులే అయ్యింది. ఇండియాకు తిరిగి వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినా, కరోనా నిబంధనల ప్రకారం వచ్చాక 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి కావడంతో బాధను దిగమింగుకొని అక్కడే ఉండిపోయాడు సిరాజ్. గబ్బాలో జరిగిన నిర్ణయాత్మక చివరి టెస్ట్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఐదు వికెట్లు పడగొట్టి ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సిరాజ్. ఐదో వికెట్ పడగొట్టాక ఆకాశం వంక తలెత్తి, తండ్రి ఆశయాన్ని నెరవేర్చినట్లు చెప్పుకున్నాడు. అతడి అమోఘ ప్రదర్శనకు క్రికెట్ పండితులు ఫిదా అయ్యారు.
కాగా ఆటో డ్రైవర్‌గా పనిచేసిన సిరాజ్ తండ్రి కొడుకును టీమిండియా క్రికెటర్‌గా చూడాలనే కోరికతో అనేక కష్టనష్టాలకోర్చారు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ను చూసి ఎంతో మురిసిపోయారు. కానీ కొడుకును టెస్ట్ క్రికెటర్‌గా చూడాలనే ఆశ తీరకముందే చనిపోయారు. తన ప్రదర్శనతో తండ్రిని అసలు సిసలు నీరాజనం సమర్పించాడు సిరాజ్.
తన తల్లిని చూడ్డానికంటే ముందు ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా తన తండ్రి దగ్గరకు వెళ్లి ఆయనకు నివాళులర్పించానీ, కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చొన్నాననీ చెప్పాడు సిరాజ్. "ఆయనతో నేను మాట్లాడలేను కానీ ఆయన సమాధికి పూలు సమర్పించాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. ఆమెను ఏడవవద్దని ఓదార్చేందుకు యత్నించాను. ఇది చాలా భిన్నమైన ఫీలింగ్. ఆరేడు నెలల తర్వాత ఆమె దగ్గరకు వచ్చాను. నేనెప్పుడు వస్తానా అని ఆమె ఎదురుచూస్తూ ఉంది. నేను రావడానికి ఎన్ని రోజులున్నాయా అని లెక్కపెట్టుకుంటూ ఉంది." అని ఎమోషనల్‌గా చెప్పాడు సిరాజ్.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
