జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్?
on Apr 7, 2021
క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేది టాలీవుడ్లో ఇటీవలి కాలంలో మోస్ట్ పాపులర్ వర్డ్ అయిపోయింది. 'మహర్షి' మూవీ తర్వాత సుకుమార్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల చేయట్లేదని ఎప్పుడైతే మహేశ్ స్వయంగా వెల్లడించాడో, అప్పట్నుంచీ ఆ పదానికి చాలా పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత 'ఆచార్య' మూవీలో హీరోయిన్ క్యారెక్టర్‌ను క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల వదులుకున్నానని త్రిష తెలపడం మనకు తెలిసిందే.
ఇప్పుడు మరోసారి అలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గట్టిగా వినిపిస్తోంది. తారక్ హీరోగా నటించే 30వ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటున్నారు. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా 'అరవింద సమేత' అప్పటికి ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాజమౌళితో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత మరోసారి త్రివిక్రమ్‌తో జట్టు కట్టేందుకు తారక్ సన్నద్ధమయ్యాడు.
నిప్పులేనిదే పొగరాదన్నట్లు.. ఇప్పుడు త్రివిక్రమ్‌తో క్రియేటివ్ డిఫరెన్సులు రావడంతో ఆ ప్రాజెక్ట్‌ను తారక్ వదులుకున్నాడని వినిపిస్తోంది. తన 30వ సినిమాని త్రివిక్రమ్ బదులు కొరటాల శివ డైరెక్షన్లో చేయడానికి అతను నిర్ణయించుకున్నాడని టాలీవుడ్లో బజ్ నడుస్తోంది. మరోవైపు తారక్ బదులు మహేశ్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడంటున్నారు. మహేశ్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీదే ఈ సినిమా ఉంటుందంని సమాచారం. సో.. ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేవి టాలీవుడ్లో మామూలైపోయాయని జనాలు చెప్పుకుంటున్నారు.