చిరంజీవి - కొరటాల శివ మూవీ లాంఛనంగా మొదలైంది
on Oct 8, 2019
'సైరా.. నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్ధరి కాంబినేషన్ మూవీ నిర్మాణ కార్యక్రమాలు విజయదశమి సందర్భంగా మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మెగాస్టార్స్‌తో మునుపటి రెండు సినిమాలు 'ఖైదీ నంబర్ 150', 'సైరా' చిత్రాల్ని నిర్మించిన ఆయన తనయుడు, హీరో రాంచరణ్ ఈ సినిమానీ నిర్మిస్తుండటం గమనార్హం. కాకపోతే ఈ సినిమాని మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో ఆయన నిర్మిస్తున్నాడు. ఆ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్.
ఈ మూవీలో చిరంజీవి జోడీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది. ఇప్పటివరకూ ఎడిటర్‌గా అక్కినేని శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌గా తిరు, ప్రొడక్షన్ డిజైనర్ (ఆర్ట్ డైరెక్టర్)గా సురేశ్ సెల్వరాజన్ ఎంపికయ్యారు.
ఇప్పటివరకూ కొరటాల శివ రూపొందించిన సినిమాలన్నీ ఘన విజయం సాధించడం గమనార్హం. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాల్ని ఆయన డైరెక్ట్ చేశాడు. ఈ నాలుగు సినిమాలూ ఆయా హీరోల కెరీర్‌లో అప్పటికి టాప్ గ్రాసర్స్ కావడం ఇంకో విశేషం. ప్రభాస్‌కు 'మిర్చి', జూనియర్ ఎన్టీఆర్‌కు 'జనతా గ్యారేజ్', మహేశ్‌కు 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' మరపురాని విజయాల్ని అందించాయి.
అలాంటి ఘనమైన రికార్డ్ ఉన్న కొరటాలతో సినిమా చేస్తుండటంతో చిరంజీవి ఫ్యాన్స్ అంతా అమితానందంగా ఉన్నారు. కంబ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150', హిస్టారికల్ మూవీ 'సైరా.. నరసింహారెడ్డి'తో తన పునరాగమనాన్ని గొప్పగా చాటుకున్నాడు. ఈ ప్రయాణం కొరటాల శివ సినిమాతో మరింత వేగాన్ని పుంజుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
