ఇప్పుడైతే 'బాహుబలి' తీయలేరట!
on May 27, 2020
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వసూళ్ల లెక్కలలో 'బాహుబలి' చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా అంటే ప్రపంచం తలెత్తుకుని చూసేలా చేసింది. దేశంలో రెండువేల కోట్ల రూపాయలు పైచిలుకు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కరోనా తర్వాత లెక్కలు మారతాయని పరిశ్రమ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? ఒకవేళ వేస్తే 'బాహుబలి' రికార్డులు బద్దలుకొట్టేది ఏది? అనే చర్చ కొందరి మధ్య నడుస్తోంది. వసూళ్ల సంగతి పక్కన పెడితే 'బాహుబలి' లాంటి సినిమాలను ఇప్పుడు తీయలేరని ఆ సినిమా నిర్ణతలలో ఒకరైన శోభు యార్లగడ్డ చెబుతున్నారు.
"ఇప్పుడు కొత్తగా ఎవరూ భారీ సినిమాలు తీయాలని సంకల్పించే పరిస్థితి లేదు. భారీగా సినిమాలు తీయాలని అనుకున్నా, ఆ స్థాయిలో వ్యాపారం చేసుకోవాలన్నా కష్టమే. ఇప్పటికే ప్రారంభమైన భారీ సినిమాలను పక్కన పెడితే, మళ్ళీ కొత్తగా 'బాహుబలి' లాంటి సినిమాలు ఇప్పుడు అయితే ఎవరూ చేయలేరు" అని శోభు యార్లగడ్డ వివరించారు.
'బాహుబలి' తర్వాత రాజమౌళి ఎటువంటి సినిమా తీస్తారా? అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆయన ఆస్థాయి సినిమా 'ఆర్ఆర్ఆర్' ప్రకటించారు.అసాధ్యమనుకున్న కాంబినేషన్ సుసాధ్యం చేసి చూపించారు. ఆల్రెడీ రిలీజైన ఒక టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఆ సినిమాకు వచ్చే వసూళ్లను బట్టి భారీ సినిమాలు తీయాలా? వద్దా? అని దర్శకులు, నిర్మాతలు ఆలోచించుకోవచ్చు.
Also Read