దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయలేరా?
on May 27, 2020
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు చిరంజీవి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ని సైతం కలుస్తామని తెలిపారు. నిర్మాతలు, దర్శకులు, ఇతర పరిశ్రమ ప్రముఖులతో భేటీలు నిర్వహించి పరిశ్రమ బాగు కోసం ఏం చేస్తే బావుంటుందో సమాలోచనలు చేస్తున్నారు. ఒకప్పుడు పెద్దన్న పాత్రను దాసరి పోషించారు. ఆయన మరణం తర్వాత ఎవరూ ఈస్థాయిలో పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు. యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. కరోనా తర్వాత చిరంజీవి తీసుకోవడం ప్రారంభించారు. అయితే, మెగాస్టార్ నాయకత్వంపై ఇండస్ట్రీలో అందరి నుండి ఆమోదముద్ర లభించలేదు. దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయలేరని అర్థం వచ్చేలా కొందరు మాట్లాడుతున్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అయితే చిరంజీవి అపాయింట్మెంట్ కోసం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులు నెలల తరబడి ఎదురు చూడాలని వ్యాఖ్యానించారు. "దాసరి స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. గంటల తరబడి ఆయన కార్మికుల సమస్యలను ఓపిగ్గా వినేవారు. స్పాట్ బాయ్స్, లైట్ మెన్ సమస్యలు సైతం పరిష్కరించారు. చిరంజీవి దగ్గరకు వస్తే కార్మికులను వదిలేయండి. ఆయన అపాయింట్మెంట్ కోసం ఇండస్ట్రీలో టాప్ పర్సన్స్ నెలలు వెయిట్ చేయాలి" అని ప్రసన్నకుమార్ అన్నారు. మరోవైపు ఈ విమర్శలను నిర్మాత సి. కళ్యాణ్ కొట్టిపారేశారు. ఇప్పుడు చిరంజీవి అందరికీ అందుబాటులో ఉంటున్నారని ఆయన అన్నారు. మొదట ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి చిరంజీవి అయిష్టత వ్యక్తం చేశారని, ఆయనను ఒప్పించడానికి ఇండస్ట్రీకి మూడు నెలలు పట్టిందని కళ్యాణ్ తెలిపారు.
Also Read