ENGLISH | TELUGU  

'బ్రూస్ లీ' మూవీ రివ్యూ

on Oct 16, 2015

ఈనాటి సినిమాల్లో అన్నీ ఉంటున్నాయ్‌!
పాట‌లు, పంచ్ డైలాగుల‌తు
ఫైట్లూ.. ఫీట్లూ.
లేదిద‌ల్లా... కొత్త‌ద‌నం, క‌థ‌.

అస‌లు క‌థ‌ని భూత‌ద్దం పెట్టి వెదికినా దొర‌క‌ని ప‌రిస్థితి. చూసిందే చూడ్డం.. ప్రేక్ష‌కుల‌కు, తీసిందే తీయడం ద‌ర్శ‌కుల‌కు అల‌వాటైపోయింది. అదేంటే... హీరోలు కూడా.. క‌మ‌ర్షియ‌ల్ ప‌డిక‌ట్టుకే అల‌వాటుప‌డిపోతున్నారు. అలాంటి సినిమానే బ్రూస్లీ కూడా.

క‌లెక్ట‌ర్ కావ‌ల్సిన‌ కార్తిక్(చరణ్) ... స్టంట్ మాస్ట‌ర్‌గా జీవితాన్ని గ‌డుపుతుంటాడు. నాన్న రామచంద్ర (రావు రమేష్) ఆశ‌యాల‌కు అనుగుణంగా అక్క కావ్య(కృతి ఖర్భంద) కి క‌లెక్ట‌ర్ చేయడానికి శ్ర‌మిస్తుంటాడు. కార్తీక్  జీవితం లో కి రియా(రకుల్ ప్రీత్ సింగ్) ప్రవేశిస్తుంది. అక్క‌డ్నుంచి కార్తీక్ జీవితం మ‌లుపు తిరుగుతుంది.  తనకు తెలియకుండానే దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) తో గొడ‌వ పెట్టుకొంటాడు. మ‌రోవైపు జయరాజ్(సంపత్) మరియు వసుంధర(నదియ)లు కావ్య‌ని త‌మ కోడ‌లుగా చేసుకొందామ‌నుకొంటారు. దీప‌క్ మాత్రం.. కార్తీక్ కుటుంబంపై క‌క్ష్య పెంచుకొని.. ఆ కుటుంబాన్నినాశ‌నం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకొంటాడు. అక్క కావ్య పెళ్లి కోసం కార్తీక్ ఏం చేశాడు??  దీపక్ ఎత్తుల నుంచి త‌న కుటుంబాన్ని ఎలా ర‌క్షించాడు అనేదే ఈ చిత్ర క‌థ‌.

ఏదో త‌ల‌లు బ‌ద్ద‌లుకొట్టుకొని మ‌రీ త‌యారు చేసిన క‌థ కాదిది. ఇలాంటి క‌థ‌లు 80వ ద‌శ‌కంలోనే ఎన్నో చూసేశాం. అయితే ఇక్క‌డ హీరో స్టంట్ మాస్ట‌ర్ కావ‌డ‌మే కాస్త కొత్త‌ద‌నం. ఆ నేప‌థ్యంలో వ‌చ్చిన స‌న్నివేశాల‌న్నీ బాగానే ఉంటాయి. చ‌ర‌ణ్ మేన‌రిజం, పాట‌లు, ఫైట్లూ.. వీటితో కాల‌క్షేపం చేసేస్తూ... మ‌ధ్య‌లో జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, 30 ఇయ‌ర్స్ ఇండ్ర‌స్ట్రీ ఫృద్వీ కామెడీని అడ్డు పెట్టుకొని ఫ‌స్టాప్ లాంగించేశాడు. అందులో హీరో.. అక్క కోసం చేసిన త్యాగాలు బోల్డ‌న్ని. హీరోయిన్ కోసం హీరో పోలీస్ లా న‌టించ‌డం, విల‌న్ అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం.. ఇవ‌న్నీ రొటీన్‌గా సాగిపోతాయి. సెకండాప్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి.. శ్రీ‌నువైట్ల మ‌ళ్లీ త‌న‌దైన పాత ఫార్ములాలోకి వెళ్లిపోయాడు. హీరో ఒక్క‌డే కానీ.. డ్యూయెల్ రోల్‌లా మార్చి క‌న్‌ఫ్యూజ్ డ్రామా న‌డ‌పాల‌ని చూశాడు. అయితే... అందులో కామెడీ మాత్రం మిస్స‌యి.. శ్రీ‌నువైట్ల ఆలోచ‌న ఘోరంగా దెబ్బ‌తింది. సెంటిమెంటు సీన్లు ఎక్కువ‌వ్వ‌డం, అందులో ఎమోష‌న్ లేకపోవ‌డం, సిల్లీ స‌న్నివేశాల‌తో సెకండాప్ బోర్ కొట్టించాడు. ఎంత‌గా అంటే.. థియేట‌ర్లోంచి లేచి వెళ్లిపోవాల‌న్నంత!  అయితే ప‌తాక స‌న్నివేశాల్లో చిరు ఎంట్రీ... మ‌ళ్లీ కాస్త ఊపిరిలూదింది. చిరంజీవి కోస‌మైనా సెకండాప్ భ‌రిస్తారులే అని ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్థాన్ని బాగా లైట్ తీసుకొన్న‌ట్టున్నాడు. చిరంజీవి లేక‌పోతే... సెకండాప్ మొద‌లైన కాసేప‌టికే థియేట‌ర్ మొత్తం ఖాళీ అవుతుంది అని ఎవ‌రైనా అంటే.. అందులో అత‌ని త‌ప్పేదేం ఏమీ లేద‌ని గ్ర‌హించాలి. ఫ‌స్టాఫ్ లో కొన్ని స‌న్నివేశాలు, చివ‌ర్లో చిరు ఎంట్రీ త‌ప్ప‌.. బ్రూస్లీలో విష‌యం లేక‌పోయింది.

చ‌ర‌ణ్‌కి ఒక ర‌కంగా కొత్త పాత్ర అని చెప్పొచ్చు. కాస్త ఎమోష‌న్‌లా న‌టించాల్సిన సంద‌ర్భాలు చాలా వ‌చ్చాయి. వాటిలో ఓకే అనిపించుకొన్నా, త‌న‌దైన మార్క్ చూపించే డాన్సుల్లో, ఫైట్ల‌లో అభిమానుల్ని అల‌రిస్తాడు. డాన్సులు కొత్త‌గా చేయాల‌న్న త‌ప‌న‌.. ఈ సినిమాలోనూ తీర్చుకొన్నాడు. అయితే చ‌ర‌ణ్‌ని సెంటిమెంట్ సీన్ల‌లో చూడ‌డం బోరే!  ఒక‌ట్రెండ‌యితే ఫ‌ర్వాలేదు. సెకండాఫ్‌లో స‌గం అలాంటి స‌న్నివేశాలే. కాబ‌ట్టి.. ఫ‌స్టాప్‌లో అల‌రించిన చ‌ర‌ణ్, సెకండాఫ్ కి న్యాయం చేయ‌లేక‌పోయాడ‌నే చెప్పాలి.చివ‌ర్లో వ‌చ్చిన చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. 150వ సినిమా కోసం స‌ర్వం.. సిద్ధం అన్న‌ట్టు క‌నిపించింది చిరు ఎంట్రీ. మెగా అభిమానుల‌కు మాత్రం ఆ మూడు నిమిషాలూ పండ‌గే. ర‌కుల్ మ‌రోసారి గ్లామ‌ర్ నే అడ్డుపెట్టుకొంది. పాట‌ల్లో రెచ్చిపోయింది. రావుర‌మేష్‌, న‌దియా... త‌మ అనుభ‌వాన్నిచూపించారు. కుర్ర విల‌న్ ఆక‌ట్టుకొంటాడు. త‌న‌కు ఈ సినిమాతో మ‌రిన్ని అవ‌కాశాలు రావొచ్చు. బ్ర‌హ్మానందం కామెడీ మ‌ళ్లీ ఫెయిల‌య్యింది. శ్రీనువైట్ల ఈసారి బ్ర‌హ్మానందం నుంచి కామెడీ పిండుకోలేక‌పోయాడు. పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి ఓకే.

త‌మ‌న్ ఊక‌దంపుడికి..చ‌ర‌ణ్‌స్టెప్పులు జ‌త క‌లిశాయి కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే ఆ బీట్ కి చెవుల తుప్పు ఒదిలిపోయేదే. ఆ పాట‌ల్లో చూపించిన లొకేష‌న్లు క‌నుల‌ విందుగా ఉన్నాయి. కొన్ని స‌న్నివేశాల్లో త‌మ‌న్ నేప‌థ్య సంగీతం బాగానే వినిపించాడు. ఈ సినిమాని రిచ్‌గా చూపించ‌డంలో పొటోగ్ర‌ఫీ తోడ్ప‌డింది. క‌థ‌కుడిగా, మాట‌ల ర‌చ‌యిత‌గా. శ్రీ‌నువైట్ల పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్ మొత్తం నీర‌సం నింపేశాడు. సెంటిమెంట్ ఎక్కువ పిండేస్తే ఫ్యామిలీ ఆడియ‌న్స్ ప‌డుంటార‌ని అనుకొన్నాడేమో మ‌రి.

మొత్తంగా బ్రూస్లీ ఓ సాదా సీదా చిత్రం. ఫైట్లూ, కొన్ని స‌న్నివేశాలు త‌ప్ప‌.. ఈసినిమాలో చెప్పుకోవ‌డానికి ఏం లేదు. చిరంజీవి ఏడేళ్ల త‌ర‌వాత వెండితెర‌పై ఎలా ఉన్నాడో చూసుకోవాలంటే మాత్రం.. ఒక‌సారి వెళ్లొచ్చు. కాక‌పోతే.. ఆ మూడు నిమిషాల గురించీ రెండున్న‌ర గంట‌లు భ‌రించాలి. ఆ త‌ర‌వాత మీ ఓపిక‌..

పంచ్ లైన్‌
బ‌లం లేని బ్రూస్లీ

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.