'రాములో రాములా' పాట హిట్టవడానికి కారణం నేనే: బ్రహ్మానందం
on Jan 13, 2020
"రాములో రాములా పాట హిట్టయ్యిందంటే కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు.. నేను" అని చెప్పారు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం. "నాకు గుండెకు సంబంధించి అనారోగ్యం కలిగినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. 'అంకుల్.. మీరు పర్ఫెక్టుగా ఉన్నారు.. రెస్ట్ తీసుకున్నాక మొట్టమొదట నా సినిమాలోనే మీరు చేస్తున్నారు' అని చెప్పాడు. కలిశాడు కాబట్టి ఏదో ఎంకరేజ్ చెయ్యడం కోసం చెప్పాడేమో అనుకున్నా" అని ఆయన చెప్పారు. సోమవారం జరిగిన 'అల వైకుంఠపురములో' మూవీ థాంక్స్ మీట్లో ఆయన మాట్లాడారు.
తర్వాత తన దగ్గరకు త్రివిక్రం వచ్చారని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు. "కొంచెం సేపు మాట్లాడుకున్నాక 'సార్.. మనం కలుస్తున్నాం.. వదిలెయ్యండి' అన్నారు. వదిలెయ్యమన్నాడు కాబట్టి నేనూ వదిలేశా. సినిమా అయిపోవచ్చింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు.. ఈ సినిమాలో ఎలాగైనా బ్రహ్మానందం కనిపించాలని నాకు క్యారెక్టర్ ఇచ్చారు. మాట ఇచ్చి నిలబెట్టుకొనే వ్యక్తుల్లో ఈ ఇద్దరూ ఉంటారు. ఈ గుణం బన్నీకి మా గురువుగారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చింది. అన్నేళ్లు ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా గడిపారు. నిబద్ధతతో ఉండే అద్భుత నటుడాయన. ఆయనను అద్భుతంగా ప్రేమించి, అభిమానించి, గౌరవించిన వ్యక్తి ఆయన కుమారుడు అరవింద్ గారు. 'మా నాన్న ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. ఇష్టమైతే నన్ను పెళ్లిచేసుకో, లేకపోతే లేదు' అన్నాడు బన్నీ తన భార్యతో. దటీజ్ బన్నీ" అని చెప్పారు బ్రహ్మానందం.
నటుడిగా చెప్పాలంటే అతను ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అని ఆయనన్నారు. "ఏ మనిషికీ ఊరికే పేరు రాదు, ఊరికే గొప్పవాడు కాడు. దాని వెనుక అతని కృషి వుంటుంది. అలాంటి సామర్థ్యమున్న నటుడు బన్నీ. రచయితగా త్రివిక్రం గురించి చెప్పడం జగమెరిగిన బ్రాహడికి జంధ్యమేల.. అన్నట్లుంటుంది. మా కమెడియన్స్ అందరికీ ఆయన దగ్గరివాడు. తమన్ అద్భుతమైన ట్యూన్స్ కట్టాడు. ఈ సంక్రాంతి పండగ నుంచి ఉగాది పండగ వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. తప్పదు" అని బ్రహ్మానందం తెలిపారు.
Also Read