పవన్ కల్యాణ్‌కు ఎంత పొగరుందో చిట్టా విప్పిన బండ్ల గణేశ్!
on Apr 4, 2021
"నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేశ్ అని సగర్వంగా చెప్పుకుంటా." అన్నారు నిర్మాత బండ్ల గణేశ్. అంతే కాదు.. పవన్ కల్యాణ్‌కు ఎంతటి పొగరుందో చాలా పెద్ద చిట్టా విప్పారాయన. ఆదివారం రాత్రి శిల్పకలావేదికలో జరిగి పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న గణేశ్ తనదైన స్టైల్లో చెలరేగిపోయి మాట్లాడారు.
"పవన్ గారికి పొగరు అన్న ఓ వ్యక్తికి... పాక్ గడ్డమీద ఆ సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసంకట్టుకు ఉన్నంత పొగరు పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పా. చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా. బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా. భారత రాజ్యాగంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా. యవ్వనంలో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తిలో ఉన్నంత పొగరుందని చెప్పా. పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలోని పదునంత పొగరుందని చెప్పా. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నింటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాని గుండెకున్నంత పొగరుందని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్." అని ఏకబిగిన ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు గణేశ్.
ఆయన వాగ్ధాటికి ఆశ్చర్యపోతూ, ఆయన మాట్లాడుతున్నంత సేపూ నవ్వతూ వచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత తన ప్రసంగంలో, "బండ్ల గణేష్ లా మాట్లాడలేం కదా. పొలిటికల్ సభలైతే మాట్లాడొచ్చు గానీ ఇక్కడకొచ్చి ఎక్కువ మాట్లాడలేం." అని చెప్పారంటే.. గణేశ్ ఏ రేంజ్లో మాట్లాడారో ఊహించుకోవాల్సిందే.
Also Read