బాలయ్యే అన్ని చూసుకుంటాడు, కానీ...
on May 1, 2018
నటసింహ నందమూరి బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ నుండి డైరెక్టర్ తేజ తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, మరి ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు? రాఘవేంద్ర రావు, క్రిష్, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి పేర్లు వినబడ్డాయి. కానీ, వీళ్ళెవరూ, ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదని తెలిసింది. ఒక రకంగా ఎన్టీఆర్ బయోపిక్ చేయడం సాహసం గా అందరూ భావించినట్లు తెలిసింది. అయితే, రాఘవేంద్ర రావు ని కలిసినప్పుడు తాను కూడా అంత ధైర్యం చేయలేనని ఖరాఖండీగా చెప్పాడట. తనకు అనుభవం లేదు కాబట్టి, కనీసం దర్శకత్వ పర్యవేక్షణ అయినా చేయమని విన్నవించుకున్నాడట. నందమూరి కుటుంబం పై అభిమానం కొలది, రాఘవేంద్ర రావు ఈ సినిమాకి పని చేయడానికి ఒప్పుకున్నాడట. ఆర్టిస్టుల సెలక్షన్ దగ్గర నుండి, ప్రతి విషయంలో రాఘవేంద్ర రావు తన సూచనలు ఇస్తాడట. అయితే, దర్శకేంద్రుడి పని సూచనలు ఇవ్వడం వరకే అని తెలిసింది. ప్రతి విషయంలో, ఫైనల్ డెసిషన్ బాలకృష్ణే తీసుకుంటాడట. అంతేనా, దర్శకత్వం వహించడం, నటించడంతో పాటు, బాలకృష్ణ నిర్మాణ బాధ్యతలు కూడా వహిస్తున్న విషయం తెలిసిందే. సహ నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధం గా ఉన్నప్పటికీ, బాలకృష్ణే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాడని సమాచారం. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.