అరుంధతికి పుష్కరకాలం
on Jan 16, 2021
లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరీర్ ని మేలిమలుపు తిప్పిన చిత్రం అరుంధతి. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ ఫీమెల్ సెంట్రిక్ ఫిల్మ్.. బ్లాక్ బస్టర్ బాట పట్టి అప్పట్లో వార్తల్లో నిలిచింది. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ హరర్ మూవీలో అరుంధతి, జేజమ్మగా అనుష్క ద్విపాత్రాభినయం చేశారు. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో రియల్ హీరో సోనూసూద్ ప్రతినాయకుడిగా అలరించారు.
అర్జున్ బజ్వా, షాయాజీ షిండే, కైకాల సత్యనారాయణ, మనోరమ, సుభాషిణి, చలపతి రావు, భానుచందర్, బేబి దివ్య నగేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కోటి అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. సెంథిల్ కుమార్ విజువల్స్ అరుంధతికి స్పెషల్ ఎట్రాక్షన్.
ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ బాలనటి, ఉత్తమ ఎడిటర్ (మార్తాండ్ కె. వెంకటేష్), ఉత్తమ కళా దర్శకుడు (అశోక్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ (రాధాకృష్ణ, మధుసూదన్ రెడ్డి), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (దీపా చందర్), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ (రమేష్ మహంతి), ఉత్తమ అనువాద కళాకారుడు (పి. రవిశంకర్), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ (రాహుల్ నంబియార్), స్పెషల్ జ్యూరీ అవార్డ్ (అనుష్క).. ఇలా పలు విభాగాల్లో అరుంధతి నంది పురస్కారాలు అందుకుంది.
2009 జనవరి 16న విడుదలై అఖండ విజయం సాధించిన అరుంధతి.. నేటితో 12 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.