అంతరిక్షం రివ్యూ
on Dec 21, 2018
నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరి, లావణ్యా త్రిపాఠి, శ్రీనివాస్ అవసరాల, సత్యదేవ్, రెహమాన్, రాజా తదితరులు
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
కెమెరా: జ్ఞానశేఖర్ (బాబా)
కూర్పు: కార్తీక శ్రీనివాస్
మాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్ విహారి
సమర్పణ: రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కథ, కథనం, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
విడుదల తేదీ: డిసెంబర్ 21, 2018
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'ఘాజీ' ఓ మేలు మలుపు. కమర్షియల్ సినిమా సూత్రాలకు దూరంగా, భిన్నంగా తెలుగులో సరికొత్త సినిమాలు వస్తాయని, తెలుగు దర్శక నిర్మాతలు తీయగలరని ప్రపంచానికి చాటిన సినిమా. తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారని నిరూపించిన సినిమా. 'ఘాజీ'తో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి, తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవంతో పాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చి పెట్టాడు. 'ఘాజీ' తరవాత సంకల్ప్ దర్శకత్వం వహించిన సినిమా 'అంతరిక్షం'. విభిన్న కథలకు ఓటేస్తున్న వరుణ్ తేజ్ ఇందులో హీరో. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదవండి.
కథ:
దేవ్ (వరుణ్ తేజ్) ఓ సైంటిస్ట్. గతంలో స్పేస్ సెంటర్లో ఉద్యోగి. వ్యక్తిగత జీవితంలో తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి (లావణ్యా త్రిపాఠి) దూరం కావడంతో... వృత్తిపరమైన జీవితంలో తాను ఎంతగానో ప్రేమించిన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. ఐదేళ్ల తరవాత రియా (అదితిరావ్ హైదరి) అనే సైంటిస్ట్ ఎక్కడో ఒంటరిగా ఉంటున్న దేవ్‌ని వెత్తుకుంటా వస్తుంది. ఇండియా స్పేస్‌లోకి పంపిన శాటిలైట్ మిహిరా అనుకున్న దిశలో కాకుండా వేరే దిశలో వెళ్తుందని, ఆ సమస్యను సరిచేయడానికి దేవ్‌ని రమ్మని అడుగుతుంది. తొలుత రియా విజ్ఞప్తిని పట్టించుకోని దేవ్, తరవాత సమస్యను పరిష్కరించడానికి అంగీకరిస్తాడు. దేవ్, రియా, మరో ఇద్దరు అంతరిక్షంలోకి వెళతారు. అక్కడ ఏం జరిగింది? మిహిరా సమస్యను పరిష్కరించడంలో దేవ్ అండ్ కోకి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది సినిమా.
విశ్లేషణ:
'ఘాజీ' తరవాత మరోసారి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ తీసిన దర్శకుణ్ణి అభినందించాలి. సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తే... స్పేస్ నేపథ్యంలో వచ్చిన కొన్ని హాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే... దర్శకుడు సంకల్ప్ హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందాడు తప్ప, ఎక్కడా కాపీ చేయలేదు. స్పేస్ సినిమాలు హాలీవుడ్లో వచ్చాయి కనుక.. పోలికలు రావడం సహజం. వీటిని పక్కన పెడితే... సినిమా ప్రారంభంలో ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా కథలో వెళ్ళాడు దర్శకుడు. ప్రథమార్థంలో పాత్రలను పరిచయంతో పాటు అసలు కథేంటి? అనేది మెల్లమెల్లగా చెప్పాడు. ద్వితీయార్థం అంతా స్పేస్ లో జరుగుతుంది. అక్కడ సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. సెంటిమెంట్ సీన్లు వర్కవుట్ కాకపోవడంతో పాటు కథ సీరియస్‌గా సాగుతుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం, లాజిక్స్ కి దూరంగా కొన్ని సన్నివేశాలు సాగడం ద్వితీయార్థంలో మైనస్. వీఎఫ్ఎక్స్ కొన్ని సన్నివేశాల్లో బాలేదు. అయితే... పరిమిత నిర్మాణ వ్యయంతో ఆ స్థాయిలో వీఎఫ్ఎక్స్ చేయడం గొప్ప.
ప్లస్ పాయింట్స్:
సినిమా థీమ్ అండ్ టేకింగ్
తెలుగులో ఇప్పటివరకూ టచ్ చేయని జానర్
వరుణ్ తేజ్, అదితి, లావణ్య తదితరుల నటన
వీఎఫ్ఎక్స్ (కొన్ని సన్నివేశాలను క్షమించేయండి)
సమయమా సాంగ్, రీ రికార్డింగ్
మైనస్ పాయింట్స్:
లాజిక్స్ లేని కొన్ని సన్నివేశాలు.
సెంటిమెంట్ సీన్స్ వర్కవుట్ కాలేదు.
ద్వితీయార్థంలో సాగదీత.
నటీనటుల పనితీరు:
దేవ్ పాత్ర నటుడిగా వరుణ్ తేజ్‌కు పరీక్ష పెట్టలేదు. కానీ, పాత్రకు ఏం కావాలో? పాత్రలో ఎంతవరకూ నటించాలో? తెలుసుకుని నటించాడు. వరుణ్ తేజ్ నటన వల్ల పాత్ర హుందాగా ఉంది. లావణ్యా త్రిపాఠి పాత్ర నిడివి తక్కువైనా... ఉన్నంతలో బాగా చేసింది. పాత్రకున్న పరిమితుల వల్ల అదితిరావ్ ఎక్కువ హావభావాలు ప్రదర్శించలేకపోయింది. ఆమె నటన పర్వాలేదు. రాజా, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల, రెహమాన్ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు.
చివరగా:
కమర్షియల్ అంశాలకు సుదూరంగా సినిమాను తీశారని అంతరిక్షాన్ని విమర్శించే ప్రేక్షకులు ఉండవచ్చు. అయితే... సినిమాలో కొత్తదనమే కమర్షియల్ విలువల పేరుతో సగటు పాటలు, రొటీన్ సన్నివేశాలను లేకుండా తీయడం! సినిమా చూశాక... ఇంకొంచెం బాగా తీయవచ్చు అనే అభిప్రాయం వచ్చినా, ప్రయత్నం చేసిన చిత్ర బృందాన్ని అభినందించడం సబబుగా ఉంటుంది. ఇటువంటి చిత్రాలను ఆదరిస్తే తెలుగులో మరిన్ని కొత్త కథలు, సినిమాలు వస్తాయి. రొటీన్ సినిమాలు తగ్గుతాయి.
రేటింగ్: 3/5

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
