స్కాట్లాండ్లో షూటింగ్‌కు వెళ్లనున్న 'బెల్ బాటమ్'
on Jul 15, 2020
కొవిడ్-19 దెబ్బకు ఎంటర్టైన్మెంట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. అయితే లాక్డౌన్ ఎత్తివేశాక ఇప్పటికే షూటింగ్‌లు పూర్తయిన సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా, సెట్స్ మీదున్న సినిమాల షూటింగ్‌లను పునరుద్ధరించేందుకు వాటి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న 'బెల్ బాటమ్' మూవీ షూటింగ్‌ను స్కాట్లాండ్లో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ మొదటి వారంలో ముంబై నుంచి అక్షయ్ సహా కొంతమంది యూనిట్ అక్కడకు వెళ్లనున్నట్లు సమాచారం. 45 రోజుల పాటు అక్కడ సుదీర్ఘ షెడ్యూల్ జరపనున్నారు.
ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బెల్ బాటమ్ యూనిట్ ఫొటోను అక్షయ్ షేర్ చేశాడు. ఆ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాశాడు. "వచ్చే నెల 'బెల్ బాటమ్' ఫ్లోర్స్ మీదకు వెళ్లనుంది" అని కూడా అతను తెలిపాడు. అక్షయ్‌కుమార్‌తో తొలిసారి జోడీగా నటిస్తోన్న వాణీ కపూర్ తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతోంది. మళ్లీ సెట్స్‌పైకి వెళ్లడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాననీ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నామనీ తెలిపింది.
1980ల నాటి నేపథ్యంతో స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'బెల్ బాటమ్'కు రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2021 ఏప్రిల్ 21న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.